WarangalVoice
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 3:46 pm Digital Edition : Ravi Goli

అక్రమంగా మట్టి తరలిస్తే కఠిన చర్యలు

జేసీబీ, రెండు ట్రాక్టర్లు సీజ్

వరంగల్ వాయిస్, గీసుగొండ : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న ముఠాపై గీసుగొండ పోలీసులు ఉక్కుపాదం మోపారు. మండల పరిధిలోని ఊకల్ గ్రామ శివారులో చట్టవిరుద్ధంగా మట్టిని తరలిస్తున్న ఒక జేసీబీతో పాటు రెండు ట్రాక్టర్లను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊకల్ గ్రామ శివారులో కొందరు వ్యక్తులు ప్రభుత్వ అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టిని తవ్వి తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న వాహనాలను గుర్తించి, వాటిని తక్షణమే సీజ్ చేశారు. వాహనాలతో పాటు వాటి డ్రైవర్లను కూడా అదుపులోకి తీసుకుని, వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా గీసుగొండ ఎస్‌హెచ్‌ఓ డి.విశ్వేశ్వర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా సహజ వనరులను, మట్టిని తరలించడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. ఎవరైనా చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.