WarangalVoice
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 2:06 pm Digital Edition : Ravi Goli

అతివేగం.. మృత్యువుకు మార్గం

సీఐ ఎడబెల్లి శ్రీనివాస్‌ రెడ్డి

వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : వాహనదారులు, ప్రయాణికులు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలంటే రోడ్డు నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జనగామ రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎడబెల్లి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన రోడ్డు భద్రతపై వాహనదారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎంతోమంది యువకులు అకాల మరణం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయం పొంచి ఉంటుందని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, ఫోర్ వీలర్ డ్రైవర్లు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. డ్రైవింగ్ చేసే సమయంలో సెల్ ఫోన్ వాడటం వల్ల ఏకాగ్రత దెబ్బతిని ప్రమాదాలు జరుగుతాయని, దీనిపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా పోలీస్ శాఖ గత ఆరు రోజులుగా అన్ని గ్రామాల్లో ‘అరైవ్ – అలైవ్’ అవగాహన సదస్సులు నిర్వహిస్తోందని సీఐ తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు రోడ్డు నిబంధనలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం రేపటితో ముగియనుందని, దీనికోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.