WarangalVoice
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 2:14 pm Digital Edition : Ravi Goli

అలరించిన శ్రీహర్ష ద్విగుణిత అష్టావధానం

(హనుమకొండ – వరంగల్ వాయిస్): సాహితీ నగరి హనుమకొండలో పద్యకళా వైభవం వెల్లివిరిసింది. కాకతీయ పద్యకవితా వేదిక ఆధ్వర్యంలో తిరుక్కోవళ్ళూర్ శ్రీహర్ష నిర్వహించిన ‘ద్విగుణిత అష్టావధానం’ సాహితీప్రియులను మంత్రముగ్ధులను చేసింది. గాంధీనగర్‌లోని కొండా యాదగిరి నివాసంలో వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ అవధాన కార్యక్రమం ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. ఈ అవధానానికి పద్యవశంకరులు, సమస్యాపృచ్ఛక చక్రవర్తి కంది శంకరయ్య సంచాలకులుగా వ్యవహరించి, కార్యక్రమాన్ని సమర్థవంతంగా నడిపించారు. అష్టావధాని తిరుక్కోవళ్ళూర్ శ్రీహర్ష నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, న్యస్థాక్షరి, వర్ణన, ఆశువు, పురాణ పఠనం, అప్రస్తుత ప్రసంగం వంటి ఎనిమిది అంశాల్లో ఒక్కొక్క అంశానికి ఇద్దరు చొప్పున.. మొత్తం 16 మంది పృచ్ఛకులు అడిగిన క్లిష్టమైన ప్రశ్నలకు దీటుగా పద్యాలను అల్లారు. అవధాని శబ్ద సౌందర్యం, శ్రావ్యమైన పఠనం మరియు అద్భుతమైన ధారణా శక్తి సభికులను రంజింపజేసింది. ఈ అవధానంలో ఎన్.వి.ఎన్.చారి, అన్నావఝ్జల సోమశేఖర శర్మ, జీడికంటి శ్రీనివాసమూర్తి, అక్కెర సదానందాచారి, వేదాంతం శ్రీదేవి, ఆనందాచారి, గుంటి విష్ణుమూర్తి, కొండా యాదగిరి, అక్కెర కరుణాసాగర్, సిద్దెంకి బాబు, కొయ్యడ శ్రీనివాస్, ముదిగొండ రమాదేవి, శ్రీదేవి, తక్కళ్ళపెళ్ళి స్వాతి, వెలుగు ప్రభాకర్, జీడికంటి సారథి ప్రాశ్నికులుగా పాల్గొని అవధానిని పరీక్షించారు. కార్యక్రమానికి గాంధీనగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సి.హెచ్. రాజిరెడ్డి, డి. కమలాకర్ రావు గార్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి అవధానిని, నిర్వాహకులను ఘనంగా అభినందించారు. పద్య విద్యను కాపాడుతున్న కాకతీయ పద్యకవితా వేదిక కృషిని వారు కొనియాడారు.