సర్పంచ్ సనత్ కుమార్ పటేల్ చొరవ
వరంగల్ వాయిస్, పరకాల: మండలంలోని అలియాబాద్ గ్రామంలో గత కొంతకాలంగా ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న కుక్కల బెడదకు సర్పంచ్ శాతరాశి సనత్ కుమార్ పటేల్ చెక్ పెట్టారు. గ్రామంలో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి, చిన్నారులు, వృద్ధులపై దాడులు జరుగుతున్నాయన్న గ్రామస్తుల ఫిర్యాదుపై ఆయన తక్షణమే స్పందించారు. మంగళవారం ప్రత్యేకంగా కుక్కలను పట్టే సిబ్బందిని గ్రామానికి పిలిపించి, వీధుల్లో సంచరిస్తున్న కుక్కలను పట్టించారు. దీనితో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి ఎంత ముఖ్యమో, ప్రజల ప్రాణరక్షణ కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. “గ్రామ సంక్షేమమే నా లక్ష్యం. నన్ను నమ్మి గెలిపించిన ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తాను. అలియాబాద్‌ను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా కర్తవ్యం” అని సర్పంచ్ సనత్ కుమార్ పటేల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు పాల్గొన్నారు.