WarangalVoice
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 2:44 pm Digital Edition : Ravi Goli

ఆగష్టులో తెలంగాణ ఉద్యమకారుల ఓదార్పు యాత్ర

వరంగల్ వాయిస్, హైదరాబాద్ : తొలి దశ తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను విస్మరించరాదని, వారికి ప్రభుత్వం సముచిత గౌరవం ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ళ రవికుమార్ డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్‌గా వేల్పుల కుమారస్వామిని, రాంపెల్లి శ్రీనివాస చారిని నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గుడిమళ్ళ రవికుమార్ మాట్లాడుతూ.. 1969 నుండి 1972 వరకు జరిగిన ఉధృతమైన తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో 369 మంది తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగం చేశారని, వారి బలిదానాల ఫలితంగానే మలిదశ ఉద్యమం ఊపందుకుని సాధన జరిగిందని కొనియాడారు. తొలి దశ ఉద్యమకారులను వెంటనే గుర్తించి గుర్తింపు కార్డులు అందించాలి. ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలంతో పాటు గౌరవప్రదమైన పెన్షన్ ఇవ్వాలి. ఉద్యమకారులకు 20 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. తొలి మరియు మలి దశ ఉద్యమకారుల త్యాగాలను స్మరిస్తూ, వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆగష్టు నెలలో “తెలంగాణ ఉద్యమకారుల ఓదార్పు యాత్ర”ను ప్రారంభిస్తామని రవికుమార్ వెల్లడించారు. అలాగే, తొలి దశ ఉద్యమకారుల ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సమావేశాన్ని ఆగష్టు 23వ తేదీన వరంగల్ నగరంలో నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుకు తొలి దశ ఉద్యమకారులందరూ పెద్దఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తొలి దశ ఉద్యమకారులు రాయబారపు సుదర్శన్, కంప సారయ్య, దాసరి శ్రీహరి, దుబాసీ రమేష్, సిరిమళ్ళ మార్కండేయ, వాడెబోయిన రాజస్వామి తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక అడాప్ కమిటీ సభ్యులు బొలిశెట్టి అశోక్, చెన్నూరి నటరాజ్, ఎర్రం మనోహర్, గుంటి పద్మ, సౌరం స్వర్ణ, అంజాద్, రాంకుమార్, గోపనబోయిన రాజు, బారిగేలా కృష్ణమూర్తి, జక్కుల స్వామి యాదవ్, రావి యాదవ్, బైరి రమేష్, శ్రీనివాస్, జనుల లక్ష్మణ్, రాంపెల్లి శ్రీనివాస చారి తదితరులు పాలుపంచుకున్నారు.