వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్
వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : వేసవి కాలంలో యువత, విద్యార్థులు ఈత నేర్చుకునే క్రమంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని జనగాం వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో చెరువులు, కాలువలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుందని, ఈ క్రమంలో చిన్నపాటి అజాగ్రత్త ప్రాణాల మీదకు తెస్తుందని హెచ్చరించారు. ఈత రాని వారు ఒంటరిగా నీటి వనరుల వద్దకు వెళ్లకూడదు. తల్లిదండ్రులు లేదా అనుభవం ఉన్న పెద్దల సమక్షంలోనే ఈత నేర్చుకోవాలి. జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్‌లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని డీసీపీ తెలిపారు. అవగాహన లేని వయసులో వాహనాలు నడపడం వల్ల తమకే కాకుండా ఎదుటివారి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని, తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. వేసవిలో ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని కోరారు. దొంగతనాలు జరగకుండా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సహకరించాలని సూచించారు. ఏదైనా అనుకోని ప్రమాదం లేదా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు వెంటనే పోలీసులకు లేదా అత్యవసర నంబర్లకు సమాచారం అందించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. “ప్రజల భద్రతే మా ప్రాధాన్యత. నిబంధనలు పాటించి వేసవిని సురక్షితంగా గడపండి.”అని డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు.