WarangalVoice
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 10:19 am Digital Edition : Ravi Goli

ఏక్తా దివస్ పరేడ్ లో హనుమకొండ జిల్లా బృందం

వరంగల్ వాయిస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా ప్రతినిధులు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. దేశ తొలి ఉపప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా జిల్లా ఏక్తానగర్‌లో నిర్వహించిన జాతీయ ఏక్తా దివస్ వేడుకల్లో హనుమకొండ జిల్లాకు చెందిన ఐదుగురు ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి హనుమకొండ జిల్లా నుంచి కోడిమాల శ్రీనివాసరావు (పూర్వ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్), పబ్బు సతీష్ (కమలాపూర్ సర్పంచ్), ఉత్తమరాజు వికాస్ (సమాజ సేవకుడు), ఒంటెల నికితాంజలి (వ్యాపార రంగం), సాయికిరణ్ రాథోడ్ (కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి) ఎంపికయ్యారు. నోడల్ ఆఫీసర్ ఆరెపల్లి సుమన్ ఆధ్వర్యంలో వీరంతా గురువారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గుజరాత్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడ స్టాట్యూ ఆఫ్ యూనిటీని సందర్శించారు. అనంతరం శుక్ర, శనివారాల్లో నిర్వహించిన జాతీయ ఏక్తా దివస్ వేడుకల్లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న కార్యక్రమాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. వేడుకలు ముగిసిన అనంతరం ఆదివారం తెలంగాణకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ అరుదైన అవకాశాన్ని కల్పించిన హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, సంబంధిత జిల్లా అధికారులు, రాష్ట్ర పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి బృంద సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బృంద సభ్యులు మాట్లాడుతూ.. జాతీయ స్థాయి వేడుకల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొనడం తమకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను చాటిచెప్పే ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడం ద్వారా దేశం, సమాజం పట్ల తమ బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. ఈ అరుదైన అవకాశం తమకు ఎంతో సంతృప్తి, ఆనందాన్ని అందించిందని వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.