WarangalVoice
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 3:42 pm Digital Edition : Ravi Goli

ఐక్యతతోనే పెరిక కుల అభివృద్ధి

ప్రొఫెసర్ వడ్డె రవీందర్

భద్రకాళి దేవాలయంలో పెరిక సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు

వరంగల్ వాయిస్, వరంగల్: కుల వ్యవస్థ కలిగిన భారతీయ సమాజంలో ఐక్యత ద్వారానే పెరిక కులం అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రేటర్ వరంగల్ పెరిక సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ వడ్డె రవీందర్ అన్నారు. బుధవారం వరంగల్ భద్రకాళి దేవాలయంలో పెరిక కుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన కుల బాంధవులను ఉద్దేశించి ప్రసంగించారు. సంఘాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా కులస్తులందరూ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ వర్గాల్లో పెరిక కులం సముచిత స్థానం పొందేలా ఐక్యమవ్వాలని కోరారు. భద్రకాళి బ్రహ్మోత్సవాల కమిటీ చైర్మన్ దిడ్డి నరేందర్, కన్వీనర్ ఆచార్య వడ్డే రవీందర్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం శరభవాహన సేవ ఘనంగా ప్రారంభమైంది.గత 14 ఏళ్లుగా పెరిక కులస్తులందరూ కలిసి అమ్మవారికి పూజలు చేయడం ఆచారంగా వస్తోంది.ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభంతో, వాయిద్య మేళాలతో కుల సంఘ నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు. హస్తా నక్షత్ర వృషభ లగ్న పుష్కరాంశ ముహూర్తాన భక్తుల గోత్రనామాలతో అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెరిక కుల సంఘం ముఖ్య సలహాదారు చింతం లక్ష్మీనారాయణ, హనుమకొండ జిల్లా అధ్యక్షులు సాయిని నరేందర్, వరంగల్ జిల్లా అధ్యక్షులు అచ్చె వినోద్ కుమార్, నాయకులు బెడిద అనిల్ కుమార్, బెడద వెంకన్న, దొంగరి శ్రీనివాస్, చిలుసాని రాజు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం వాయిదా

గతంలో ప్రకటించిన పెరిక కుల ప్రతిభా పురస్కారాల – 2026 ప్రధానోత్సవం వాయిదా పడినట్లు ప్రొఫెసర్ వడ్డె రవీందర్ తెలిపారు. ఇంటర్, ఐఐటీ, మెడిసిన్ విద్యార్థులతో పాటు, ఈరోజే ఫలితాలు విడుదలైన పదవ తరగతి విద్యార్థులను కూడా కలుపుకుని ఈ పురస్కారాలు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. విద్యార్థులు ఈ మార్పును గమనించాలని, త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.