WarangalVoice
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 4:03 pm Digital Edition : Ravi Goli

కందగట్ల గణేష్‌కు అంతర్జాతీయ పురస్కారం

వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : ముప్పై ఏళ్లుగా ఆంగ్ల బోధనలో విశేష కృషి చేస్తున్న తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు కందగట్ల గణేష్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఆంగ్ల భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని, రాజస్థాన్‌లోని కోట కేంద్రంగా పనిచేస్తున్న జ్ఞాన ఉదయ్ ఫౌండేషన్ ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన ‘ఇంటర్నేషనల్ అచీవర్స్ అవార్డు’ను ప్రకటించింది. గురువారం వెల్దిలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రిన్సిపల్ పాలకుర్తి శ్రీధర్ చేతుల మీదుగా గణేష్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది ఆయన్ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. గణేష్ తన బోధనా ప్రస్థానంలో వినూత్న పద్ధతులను ప్రవేశపెడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై ఉన్న భయాన్ని పోగొట్టి ఆసక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలోనూ ఆయన ప్రతిభను గుర్తిస్తూ ప్రభుత్వం, వివిధ సంస్థలు విద్యా రత్న, గురు రత్న, ఇన్నోవేటివ్ టీచర్ అవార్డు వంటి ఎన్నో పురస్కారాలను అందజేశాయి. అంతేకాకుండా, నైజీరియాకు చెందిన అంతర్జాతీయ ఆన్‌లైన్ విద్యా సదస్సు ‘ఏ వాక్ త్రూ ఎడ్యుకేషన్’లో వక్తగా వ్యవహరిస్తూ అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ఖ్యాతిని చాటుతున్నారు. పురస్కార గ్రహీత గణేష్ మాట్లాడుతూ.. “ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు సహకరించిన ప్రిన్సిపల్ గారికి, తోటి ఉపాధ్యాయులకు, నా కుటుంబానికి కృతజ్ఞతలు. ముఖ్యంగా నిత్యం నూతన విషయాలు నేర్చుకునేలా నన్ను ప్రోత్సహించే నా విద్యార్థులకే ఈ గౌరవం దక్కుతుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ గడ్డం జయశ్రీ, ఉపాధ్యాయులు రవి, శశికుమారి, సురేఖ, రాజు, మల్లం శ్రీధర్, సౌజన్యప్రియ, పార్వతి, వినీల, రుద్రమదేవి, షహానా, మాలతి, శ్రీను, మోహన్ రావు, వసంత మాధురి, లలిత, అమనగంటి బాలరాజు, రాజయ్య, వెనిల్ తదితరులు పాల్గొని గణేష్‌ను అభినందించారు.