WarangalVoice
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 1:54 pm Digital Edition : Ravi Goli

కరెంటోళ్ల కన్నెర్ర..

కాంగ్రెస్ సర్కార్‌కు షాక్ తప్పదు
ఏనుగుల రాకేష్ రెడ్డి
ఆర్టిజన్ల సమ్మెకు బీఆర్ఎస్ సంఘీభావం
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం

వరంగల్ వాయిస్, హనుమకొండ : రాష్ట్రంలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మె తొమ్మిదో రోజుకు చేరుకుంది. మంగళవారం హనుమకొండ ములుగు రోడ్డులోని ట్రాన్స్‌కో కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న కార్మికులకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మద్దతు ప్రకటించారు. అనంతరం భారీ బైక్ ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ సెంటర్‌లోని బాబాసాహెబ్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. “ఎన్నికల సమయంలో కరెంట్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కింది. కరెంట్ ఉద్యోగులు తలుచుకుంటే మీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చి కూల్చడం ఖాయం” అని హెచ్చరించారు. ఉమ్మడి జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు వెంటనే సమ్మె శిబిరానికి వచ్చి కార్మికుల గోడు వినాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర మరువలేనిదని, వారి కష్టాన్ని గుర్తించి గత కేసీఆర్ ప్రభుత్వం 23 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించిందని రాకేష్ రెడ్డి గుర్తు చేశారు. చరిత్రలో లేని విధంగా భారీగా పీఆర్సీ పెంచిన ఘనత బీఆర్ఎస్‌దేనని స్పష్టం చేశారు. విద్యా అర్హత ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగుల కన్వర్షన్ ప్రక్రియను వెంటనే చేపట్టాలి, ఆర్టిజన్లకు ప్రస్తుతం ఉన్న O&M సర్వీస్ రూల్స్ అమలు చేయాలి, టీజీఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్ లలో అన్-మాన్డ్ వర్కర్లను ఆర్టిజన్లుగా విలీనం చేసుకోవాలి. 2016 డిసెంబర్ 4 కంటే ముందు నుంచి పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులందరినీ ఆర్టిజన్లుగా గుర్తించాలి. 2026 పీఆర్సీని వెంటనే అమలు చేయాలి మరియు పీస్ రేట్ కార్మికులకు జీవో నెం. 11 ప్రకారం వేతనాలు చెల్లించాలి. ఆర్టిజన్ల న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని, ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం ఆపబోమని ఆయన స్పష్టం చేశారు.