WarangalVoice
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 2:30 pm Digital Edition : Ravi Goli

కళ్లాల్లో రైతు కన్నీరు..

కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతల ‘ధాన్యం’ గాథ

వరంగల్ వాయిస్, దామెర : రుతువుల పొడవునా రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట, చేతికొచ్చే వేళ అన్నదాతను కన్నీటి పర్యంతం చేస్తోంది. పరకాల నియోజకవర్గ పరిధిలోని దామెర మండలంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న విపరీతమైన జాప్యంపై రైతాంగం తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పోసి వారాలు గడుస్తున్నా.. అడుగు ముందుకు పడకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..

అకాల వర్షం ఎప్పుడు ముంచుకొస్తుందోనన్న భయం ఒకవైపు.. ఎండ తీవ్రత మరోవైపు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాత్రి వేళల్లో కళ్లాల్లోనే ధాన్యం కుప్పల వద్ద విషపురుగుల భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పడిగాపులు కాస్తున్నారు. “పాలకుల ప్రకటనలు కోటలు దాటుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. అధికారులు ఏనాడైనా కళ్లాల్లోకి వచ్చి చూస్తే మా కష్టాలు అర్థమవుతాయి” అని రైతులు మండిపడుతున్నారు.

లారీల కొరత.. తగ్గుతున్న బరువు

ధాన్యం తరలింపులో లారీల కొరత సాకుతో అధికారులు జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రోజులు గడుస్తున్న కొద్దీ ఎండ తీవ్రతకు ధాన్యం ఆరిపోయి, బరువు గణనీయంగా తగ్గిపోతోందని, ఇది తమకు తీరని ఆర్థిక నష్టాన్ని మిగులుస్తోందని వాపోతున్నారు.

రైతుల ప్రధాన డిమాండ్లు:

యుద్ధ ప్రాతిపదికన సేకరణ: ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం సేకరణను వేగవంతం చేయాలి. లారీల కొరతను అధిగమించి, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెనువెంటనే మిల్లులకు తరలించాలి. అధికారుల సమన్వయం: పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు ఈ నరకయాతన తప్పించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, తక్షణమే ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని దామెర మండల రైతాంగం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది.