WarangalVoice
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 3:38 pm Digital Edition : Ravi Goli

కాంగ్రెస్ లో బీసీలకు ఒక న్యాయం.. అగ్రకులాలకు ఇంకొక న్యాయమా..?

వరంగల్ వాయిస్, దామెర : రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖమ్మకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ ఇవ్వడంపై బీసీ నాయకుడు కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పసరగొండ గ్రామ మాజీ ఉపసర్పంచ్ కాంగ్రెస్ నాయకుడు కుమారస్వామి మాట్లాడుతూ . బీసీల విషయంలో ఒక న్యాయం..అగ్రకులాల విషయంలో మరో న్యాయం అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడం పట్ల ఆయన మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖమ్మ కూతురు కొండా సుస్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేసిన నేపథ్యంలో మంత్రి కొండా సురేఖమ్మకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని కుమారస్వామి ప్రశ్నించారు. అదే సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై తరుచూ వ్యాఖ్యలు చేస్తున్నాడని, అలాంటప్పుడు వాళ్ల అన్న అయిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారా అని కుమారస్వామి ప్రశ్నించారు. వారికి ఎందుకు ఇలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వడం లేదో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఒక న్యాయం..అగ్రకులాలకు ఇంకొక న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కూడా సామాజిక న్యాయం, సమానత్వం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ మంత్రి కొండా సురేఖమ్మకు ఇచ్చిన నోటీసును వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకుంటే బీసీల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.