
సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు
వరంగల్ వాయిస్, వరంగల్ : కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా తనను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల పట్ల గుండు సుధారాణి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. బీసీ మహిళలకు అత్యున్నత పదవులు కట్టబెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని ఆమె అభివర్ణించారు. బీసీల పక్షపాతి అయిన సీఎం రేవంత్ రెడ్డి.. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నారని సుధారాణి కొనియాడారు. బీసీ మహిళలకు కీలక పదవులు కేటాయించడం కేవలం పదవుల పంపిణీ మాత్రమే కాదని, ఆ వర్గాలపై ప్రభుత్వానికి ఉన్న నమ్మకానికి, మహిళల సామర్థ్యంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని బీసీ మహిళల్లో నూతన ఆత్మవిశ్వాసాన్ని, భవిష్యత్తుపై భరోసా నింపిందని తెలిపారు. తనపై ఉంచిన నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా, బీసీల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. ఈ నియామకానికి సహకరించిన జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులకు సుధారాణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ధనసరి అనసూయ (సీతక్క), పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, హనుమకొండ, వరంగల్ డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రాంరెడ్డి, మహమ్మద్ అయూబ్, అలాగే వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.