ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడలో ‘మున్నూరు కాపు’ కళ్యాణ మండపం ప్రారంభం
వరంగల్ వాయిస్, వేములవాడ : రాజన్న క్షేత్రమైన వేములవాడలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ప్రారంభోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. “కులం అంటే కేవలం గుర్తింపు కాదు, అది ఒక బలం మరియు బలగం” అని అభివర్ణించారు. మున్నూరు కాపులు ఐక్యంగా ఉండి ఇటువంటి సేవా భవనాలను నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. ఈ కళ్యాణ మండపం అందుబాటులోకి రావడం వల్ల నిరుపేద కుటుంబాలకు తక్కువ ఖర్చుతో శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. మున్నూరు కాపుల ఐక్యతకు, అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, సత్రం అధ్యక్షులు కోయినేని బాలయ్య, మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ వార్డుల కౌన్సిలర్లు, మున్నూరు కాపు సంఘం సభ్యులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.