సీఐ సుధాకర్ రెడ్డి
వరంగల్ వాయిస్, దామెర : వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు, దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓగ్లాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి ‘జాగృతి పోలీస్ కళా బృందం’ ఆధ్వర్యంలో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాత్రి 7:00 నుంచి 9:15 గంటల వరకు సాగిన ఈ కార్యక్రమంలో శాయంపేట సీఐ సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. యువత గంజాయి, డ్రగ్స్, గుట్కా వంటి మత్తు పదార్థాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. గ్రామంలో ఎవరైనా గంజాయి అమ్మినా లేదా సేవించినా వెంటనే 8712584473 మొబైల్ నంబరుకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. జాగృతి పోలీస్ కళా బృందం సభ్యులు తమ పాటలు, ఆటల ద్వారా పలు సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలని, మోసపోతే వెంటనే 1930 హెల్ప్ లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని నాటిక ద్వారా వివరించారు. సమాజంలో వేళ్లూనుకున్న మూఢనమ్మకాలపై మ్యాజిక్ షో నిర్వహించి ప్రజల్లో చైతన్యం నింపారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవాలని, బాల్య వివాహాలను అరికట్టాలని సందేశాత్మక పాటలు పాడారు. రోడ్డు ప్రమాదాల నివారణ, సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యత మరియు డయల్ 100 సేవలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో దామెర ఎస్సైలు అశోక్, రమేష్, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అలాగే హెడ్ కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, రత్నయ్య, పీసీ పూల్ సింగ్, హోంగార్డులు శ్రీనివాస్, విక్రమ్ రాజు, నారాయణ, చిరంజీవి, సుమారు 200 మంది గ్రామ ప్రజలు ఈ సదస్సులో భాగస్వాములయ్యారు.