WarangalVoice
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 2:37 pm Digital Edition : Ravi Goli

గిర్నిబావిలో కంకులతో ‘మొక్కజొన్న ఇల్లు’

వినూత్న ప్రదర్శనతో ఆకట్టుకున్న బాయర్ కంపెనీ

ముఖ్య అతిథిగా హాజరైన నాగుర్ల వెంకటేశ్వర్లు

వరంగల్ వాయిస్, గిర్నిబావి (నర్సంపేట) : వరంగల్ జిల్లా నర్సంపేట గిర్నిబావి గ్రామంలో బుధవారం నిర్వహించిన మొక్కజొన్న ప్రదర్శన క్షేత్ర సందర్శన కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. బాయర్ కంపెనీ ప్రతినిధులు మొక్కజొన్న కంకులతో అద్భుతమైన ‘ఇంటి’ ఆకారాన్ని నిర్మించి, తమ విత్తన రకాల సామర్థ్యాన్ని డీలర్లు మరియు రైతులకు వినూత్నంగా ప్రదర్శించారు. మొక్కజొన్న కంకులతో నిర్మించిన ఈ ఇంటిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రదర్శన వ్యవసాయంపై ఆసక్తిని పెంచుతోందని రైతులు, డీలర్లు హర్షం వ్యక్తం చేశారు. బాయర్ ప్రతినిధులు అశోక్ రెడ్డి, విక్రమ్, సతీష్, సాయి కృష్ణ మాట్లాడుతూ.. తమ కంపెనీకి చెందిన డీకాల్బ్ 9217, 9247 రకాలు బలమైన వేరు వ్యవస్థ, గట్టి కాండం కలిగి ఉండి, నిండుగా ఉండే కంకులతో అత్యధిక దిగుబడిని ఇస్తాయని వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ అధ్యక్షుడు మరియు రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వడగాలులు, అకాల వర్షాలను తట్టుకునేలా బలమైన వేరు వ్యవస్థ ఉన్న రకాలను ఎంచుకోవడం వల్లే రైతులకు లాభం చేకూరుతుందని, అధిక దిగుబడినిచ్చే ఇలాంటి హైబ్రిడ్ రకాలను రైతులు ఆదరించాలని సూచించారు. ఏడీఏ దామోదర్ రెడ్డి మొక్కజొన్న సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విలువైన సమాచారాన్ని అందించారు. వరంగల్ ఏవో రవీందర్ రెడ్డి, దుగ్గొండి ఏవో శ్యామ్ పాల్గొని హైబ్రిడ్ రకాల సాగు విధానంపై డీలర్లకు, రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు ప్రముఖ డీలర్లు పాల్గొనగా, ప్రదర్శన అంతా ఎంతో ఉత్సాహభరితంగా సాగింది.