WarangalVoice
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 1:41 pm Digital Edition : Ravi Goli

‘గోల్డెన్ అవర్’ అత్యంత కీలకం

దామెర ఎస్సై కొంక అశోక్

వరంగల్ వాయిస్, దామెర: రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్-2026’ (Arrive Alive-2026) వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం దామెరలో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. దామెర ఎస్సై కొంక అశోక్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ప్రయాణికులకు మరియు వాహనదారులకు రోడ్డు భద్రతపై ప్రాక్టికల్ అవగాహన కల్పించారు. ప్రమాదం జరిగిన మొదటి గంట (గోల్డెన్ అవర్)లో బాధితులకు అందించే వైద్యం ప్రాణాలను కాపాడుతుందని వివరిస్తూ, ఎస్సై అశోక్ 108 అంబులెన్స్ సిబ్బందితో కలిసి ఒక నకిలీ యాక్సిడెంట్ సీన్‌ను సృష్టించారు. ప్రమాద స్థలంలో బాధితులకు ప్రాథమిక చికిత్స ఎలా అందించాలి, వారిని సురక్షితంగా ఆసుపత్రికి ఎలా తరలించాలి అనే అంశాలపై ప్రత్యక్షంగా చేసి చూపించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం బస్టాండ్‌లోని ప్రయాణికులకు ప్రమాదాల నివారణపై పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని కోరుతూ బస్సు ప్రయాణికులతో రహదారి భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ నియమాలు పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాలను అరికట్టడం సాధ్యమవుతుంది. యువత, వాహనదారులు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగస్వాములై తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 108 సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు.