ఏఐజీడీఎస్‌యూ జాతీయ అధ్యక్షుడు బొద్దున వెంకటేశ్వర్లు
వరంగల్ వాయిస్, హనుమకొండ : గ్రామీణ తపాల ఉద్యోగులకు న్యాయమైన వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వారిని తక్షణమే 8వ పే కమిషన్ పరిధిలోకి తీసుకురావాలని అఖిలభారత గ్రామీణ తపాల ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు బొద్దున వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. గ్రామీణ తపాల ఉద్యోగులకు 8వ వేతన సంఘం ప్రయోజనాలను వర్తింపజేయాలి. మెడికల్ సౌకర్యం, గ్రూప్ ఇన్సూరెన్స్, రూ.10 లక్షల గ్రాట్యుటీ మరియు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ సదుపాయాలు కల్పించాలి. పదవీ విరమణ అనంతరం పెన్షన్‌తో పాటు తగిన వైద్య సదుపాయాలు అందజేయాలి. కార్మికుల హక్కుల కోసం పోరాడి అకారణంగా విధుల నుంచి తొలగించబడిన సంఘం మాజీ జనరల్ సెక్రటరీ ఎస్.ఎస్. మహాదేవయ్యను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. 2026 మే 23 నుంచి 25 వరకు తమిళనాడులోని కృష్ణగిరిలో జరిగిన జాతీయ మహాసభల్లో ఏఐజీడీఎస్‌యూ నూతన జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యవర్గాన్ని కేంద్ర ప్రభుత్వం, తపాలశాఖ జూలై 14న అధికారికంగా ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ తపాల ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికైన నూతన జాతీయ కార్యవర్గంలో అధ్యక్షుడిగా బొద్దున వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీ: సి.కె. సుబ్రమణి (తమిళనాడు), వర్కింగ్ ప్రెసిడెంట్లు: సీబీ తివారి (ఉత్తరప్రదేశ్), సజురూల్ ఇస్లాం (పశ్చిమ బెంగాల్), ఉపాధ్యక్షులు: అజయ్ కుమార్ సింగ్ (జార్ఖండ్), మధురా సింగ్ (బీహార్), రామ్‌సింగ్ (మధ్యప్రదేశ్), అసిస్టెంట్ జనరల్ సెక్రటరీలు: ఏ.బి. రావత్ (మహారాష్ట్ర), గోపాల్ కృష్ణ నాయర్ (కేరళ), విజయ్ శర్మ (హర్యానా), ట్రెజరర్ & అసిస్టెంట్ ట్రెజరర్: నారాయణ్ చౌదరి (ఛత్తీస్‌గఢ్), జస్బీర్ సింగ్ (పంజాబ్) ఉన్నారు. ఈ విలేకరుల సమావేశంలో హన్మకొండ డివిజన్ అధ్యక్షుడు జె. బాపూజీ, సెక్రటరీ పెరుమాండ్ల తిరుపతి, కోశాధికారి ఆనందం, ప్రతినిధులు పి. శ్రీలత, జె. శ్రీనివాస్, ఎండి అజీజ్, బోగా స్వామి, పిట్టల అశోక్, జి. రాజ్ కుమార్, ఎండి యూసుఫ్ ఉద్దీన్, ఎండి అఫ్సర్ తదితరులు పాల్గొన్నారు.