WarangalVoice
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 2:45 pm Digital Edition : Ravi Goli

‘గ్రీన్ మ్యాట్’ కింద సర్పంచ్ విధులు

శిథిలావస్థకు చేరిన గంటూరుపల్లి గ్రామ పంచాయతీ భవనం

స్లాబ్ పెచ్చులు ఊడుతున్నా పట్టించుకోని అధికారులు

కొత్త భవనం మంజూరు చేయాలి

సర్పంచ్ చల్లా రాకేష్ రెడ్డి డిమాండ్

వరంగల్ వాయిస్, హసన్‌పర్తి : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు నిర్మిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పాత భవనాల్లో ప్రజాప్రతినిధులు, సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. హసన్‌పర్తి మండలంలోని గంటూరుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలుతుందో తెలియని స్థితిలో ఉంది. స్లాబ్ పెచ్చులు ఊడి నెత్తిన పడకుండా ఉండేందుకు కార్యాలయంలో ‘గ్రీన్ మ్యాట్’ పరదాలు కట్టుకుని ప్రాణభయంతో విధులు నిర్వహిస్తున్నామని హసన్‌పర్తి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, గంటూరుపల్లి సర్పంచ్ చల్లా రాకేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ గ్రామ పంచాయతీ భవనాన్ని 1984లో (దాదాపు 42 సంవత్సరాల క్రితం) నిర్మించారని తెలిపారు. ప్రస్తుతం భవనం మొత్తం పాడైపోయిందని, స్లాబ్ పెచ్చులు ఊడిపోతున్నాయని పేర్కొన్నారు. కనీసం గ్రామ పంచాయతీ పాలకమండలి సమావేశం నిర్వహించుకోవడానికి, సభ్యులు కూర్చోవడానికి కూడా స్థలం లేని చిన్న ఇరుకు గదిలో నరకం చూస్తున్నామని వాపోయారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోననే భయంతోనే గ్రీన్ మ్యాట్ పరదాల కింద కూర్చుని గ్రామ ప్రజలకు సేవలు అందిస్తున్నామని వివరించారు. నూతన భవనాన్ని నిర్మించి తమ ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు అందజేసినా లాభం లేకుండా పోయిందని సర్పంచ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి గంటూరుపల్లికి నూతన గ్రామ పంచాయతీ భవనంతో పాటు, మహిళా సంఘాల సమావేశాల కోసం ప్రత్యేకంగా మీటింగ్ హాల్‌ను కూడా మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.