WarangalVoice
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 4:00 pm Digital Edition : Ravi Goli

ఘోర రోడ్డు ప్రమాదం

టిప్పర్‌ను ఢీకొట్టిన లారీ, డ్రైవర్ మృతి
అకస్మాత్తుగా రహదారి మధ్యలో ఆగిన టిప్పర్
అదుపుతప్పి ఢీకొట్టిన లారీ
చికిత్స పొందుతూ లారీ డ్రైవర్ కన్నుమూత

వరంగల్ వాయిస్, దామెర : జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువ లారీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. దామెర క్రాస్ రోడ్డు సమీపంలోని డిస్నీలాండ్ స్కూల్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా వొలిగొండ మండలం గొల్లపెల్లి గ్రామానికి చెందిన అవిశెట్టి శ్రీశైలం (26) వృత్తిరీత్యా లారీ డ్రైవర్. అతను రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ నుంచి ఇసుక లోడ్ కోసం ఏటూరునాగారం వైపు లారీని నడుపుకుంటూ వెళ్తున్నాడు. తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో దామెర క్రాస్ రోడ్డు వద్దకు చేరుకోగా, అతని లారీ ముందు వెళ్తున్న టిప్పర్ వాహనాన్ని దాని డ్రైవర్ వోన్నాల రామకృష్ణ అకస్మాత్తుగా జాతీయ రహదారి మధ్యలో నిలిపివేశాడు. వేగంగా వస్తున్న శ్రీశైలం లారీని అదుపు చేయలేక టిప్పర్ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ నుజ్జునుజ్జు కావడంతో శ్రీశైలంకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఇతర లారీ డ్రైవర్లు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ మృతి
తీవ్ర రక్త గాయాలతో ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన శ్రీశైలంకు వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం 8:00 గంటల సమయంలో అతను మృతి చెందాడు. మృతుడి మామ బాతుక జంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దామెర పోలీసులు కేసు నమోదు చేశారు. టిప్పర్ డ్రైవర్ వోన్నాల రామకృష్ణ అజాగ్రత్తగా, నిబంధనలకు విరుద్ధంగా రహదారి మధ్యలో వాహనాన్ని ఆపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు యాదవ కులానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతి చిన్న వయసులోనే శ్రీశైలం మృతి చెందడంతో గొల్లపెల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.