పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి
కొత్తవాడ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ భవన్‌లో ఘనంగా అభినందన సభ
టెస్కో ద్వారా కార్పెట్లు, బెడ్ షీట్లు ఖరీదు చేసిన ప్రభుత్వం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర్ రావులకు కృతజ్ఞతలు
రాజకీయంగా ఎదిగి, అసెంబ్లీలో ప్రాతినిధ్యం సాధించాలని పిలుపు
వరంగల్ వాయిస్, వరంగల్ : ఇటీవల కొత్తవాడలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ముందు చేనేత కార్మికులు చేపట్టిన ధర్నా సత్ఫలితాలనిచ్చిందని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి అన్నారు. కొత్తవాడలోని పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ భవన్‌లో నిర్వహించిన పద్మశాలీల అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం టెస్కో ద్వారా స్టాక్ ఉన్న కార్పెట్లు, బెడ్ షీట్లను ఖరీదు చేసిందని గుర్తుచేశారు. ఈ విజయం ప్రతి చేనేత కార్మికుడికి చెందుతుందని పేర్కొంటూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర్ రావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన చేనేత సహకార సంఘాల ఎన్నికల్లో విజయం సాధించిన నూతన అధ్యక్షులకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పద్మశాలీలు రాజకీయంగా ఎదుగడానికి ఒకరికొకరు సహకరించుకోవాలని కమర్తపు మురళి పిలుపునిచ్చారు. సహకార స్ఫూర్తితో రాబోయే శాసనసభ ఎన్నికల్లో పద్మశాలి జనాభా అధికంగా ఉన్న సిరిసిల్ల, సిద్దిపేట, కోరుట్ల, వరంగల్, మునుగోడు, కమలాపూర్, నల్గొండ లాంటి ప్రాంతాల నుండి శాసనసభ్యులుగా విజయం సాధించాలని ఆకాంక్షించారు. తద్వారా మనకు తగిన మంత్రి పదవి దక్కితే, అది చేనేత రంగానికి, సమగ్ర పద్మశాలి సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆప్కో చైర్మన్ గడ్డం జగన్నాథం మాట్లాడుతూ.. “కలిసిఉంటే కలదు సుఖం.. విడిపోతేనే చెడిపోతాం” అని సూచించారు. పద్మశాలి సమాజం అంతా ఒకే తాటిపైకి వచ్చి రాజకీయంగా ముందుకు రావాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పద్మశాలి వర్గం ఆర్థికంగా ఎంత ఎదిగినా, రాజకీయంగా ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. ఈ అభినందన సభలో పద్మశాలి సంఘం బాధ్యులు వడ్నాల నరేందర్, ఆడెపు రవీందర్, గుండేటి నరేందర్, దేవులపల్లి సత్యనారాయణ మూర్తి, గోరంటల రాజు, చిప్ప వెంకటేశ్వర్లు, డాక్టర్ కూరపాటి రమేష్, బేతి అశోక్ బాబు, బచ్చు ఆనందం, యెలుగం చిన్న కొమురయ్య, పంతగాని శ్రీనివాస్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.