వరంగల్ వాయిస్, దామెర: మండల పరిధిలోని తక్కళ్లపాడు గ్రామంలో వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రముఖ జానపద గాయకుడు వరంగల్ శీను మంగళవారం ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ దాడి వసంత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ శీను మాట్లాడుతూ.. వేసవిలో బాటసారులు, ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్ దాడి వసంత మాట్లాడుతూ.. గ్రామంలో ఎవరికీ తాగునీటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్, స్థానిక మహిళలు, గ్రామస్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండుతున్న ఎండల్లో చలివేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.