రైతు విజయేందర్ రెడ్డి ఆయిల్ ఫామ్ తోట పూర్తిగా దగ్ధం
వరంగల్ వాయిస్, దామెర : హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ఓగులాపూర్ గ్రామంలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన రైతు ఏదుల విజయేందర్ రెడ్డికి చెందిన ఆయిల్ ఫామ్ తోటలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తోట మొత్తం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్న పంట కళ్లముందే బూడిదవడంతో బాధిత రైతు కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. బాధిత రైతు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఓగులాపూర్ గ్రామ శివారులోని తన వ్యవసాయ భూమిలో రైతు ఏదుల విజయేందర్ రెడ్డి సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ తోటను సాగు చేస్తున్నారు. అయితే, గురువారం మధ్యాహ్నం వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా తోటలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు తోట అంతటా వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తోటలోని సుమారు 70కి పైగా ఆయిల్ ఫామ్ మొక్కలు పూర్తిగా కాలిపోయాయి. వీటికితోడు తోటలో ఏర్పాటు చేసిన డ్రిప్ ఇరిగేషన్ పైపులు సైతం మంటల ధాటికి పూర్తిగా కరిగిపోయి బుగ్గయ్యాయి. మంటలు ఎగసిపడటాన్ని గమనించిన పక్క పొలాల రైతులు, స్థానికులు పరుగున వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే తోట పూర్తిగా దెబ్బతింది. అగ్నిప్రమాదం కారణంగా తమకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లిందని, చేతికొచ్చే దశలో ఉన్న తోట కాలిపోవడంతో తీవ్ర అప్పులపాలయ్యామని రైతు విజయేందర్ రెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం, రెవెన్యూ మరియు ఉద్యానవన శాఖ అధికారులు తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో ప్రమాద స్థలాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని బాధితుడు కోరారు. తమ కుటుంబానికి ప్రభుత్వ పరంగా తగిన పరిహారం అందించి, ఆర్థికంగా ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నారు.