WarangalVoice
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 2:33 pm Digital Edition : Ravi Goli

దేశసేవకు యువత ముందు రావాలి

ఎయిర్ ఫోర్స్ శిక్షణ పూర్తి చేసిన ‘కావ్య’కు ఘన సన్మానం

వరంగల్ వాయిస్, హనుమకొండ : దేశ రక్షణలో భాగస్వామ్యమై దేశసేవ చేసేందుకు యువత ఉత్సాహంగా ముందుకు రావాలని వెలుదండి వెంకట్రామయ్య పరపతి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వెలుదండి దామోదర్ పిలుపునిచ్చారు. హనుమకొండ లోని న్యూ శాయంపేటకు చెందిన వెలుదండి శ్రీధర్ – పద్మ దంపతుల కుమార్తె వెలుదండి కావ్య వైమానిక దళం శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం పరపతి సంఘం ఆధ్వర్యంలో ఆమెకు ఘన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెలుదండి దామోదర్ మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే తల్లిదండ్రులు పిల్లల్లో దేశభక్తిని, సేవాభావాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే ‘క్యాట్’ పరీక్షకు ఎంపికైన కావ్య.. మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా, తెలంగాణ గురుకులాల నుంచి వైమానిక దళానికి ఎంపికైన తొలి విద్యార్థినిగా కావ్య సరికొత్త చరిత్ర సృష్టించిందని ఆయన కొనియాడారు. పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని, కావ్య సాధించిన ఈ విజయానికి ఆమె తల్లిదండ్రులు పద్మ-శ్రీధర్‌ల ప్రోత్సాహమే కారణమని ప్రశంసించారు. సన్మానం అనంతరం ఎయిర్ ఫోర్స్ అధికారిణి వెలుదండి కావ్య మాట్లాడుతూ.. వెలుదండి కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి తనను ఇంతగా గౌరవించి, సన్మానించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని భావోద్వేగానికి లోనయ్యారు. ఎయిర్ ఫోర్స్ అధికారిగా దేశానికి సేవ చేసే అవకాశం రావడం, అందులోనూ వెలుదండి వంశపు ఆడబిడ్డగా నిలవడం గర్వంగా ఉందన్నారు. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో పరపతి సంఘం బాధ్యులు వెలుదండి రమేష్, రాము, అశోక్, ప్రసాద్, మధు, వినయ్, నవ్య, కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కావ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు.