వరంగల్ వాయిస్, దామెర: తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక,పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు దామెర మండలంలో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో మండల పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుమ్మడి కల్పన గారికి వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రెండవ పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని, 51 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణను అమలు చేయాలి. ఉద్యోగులందరికీ నగదు రహిత వైద్య సౌకర్యం కల్పించేందుకు హెల్త్ స్కీమ్‌ను తక్షణమే ప్రారంభించాలి. సీపీఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసానిచ్చే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి నిలిచిపోయిన అన్ని రకాల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలి. కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. న్యాయమైన డిమాండ్ల కోసం తాము చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, లేనిపక్షంలో నిరసనలను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ ప్రతినిధులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది, జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.