కేయూ ప్రొఫెసర్ డాక్టర్ బి.మంజుల
కేడీసీలో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’పై సదస్సు
సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలి
ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి.శ్రీనివాస్
వరంగల్ వాయిస్, హనుమకొండ : మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని కాకతీయ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బి.మంజుల సూచించారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో “ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ టుడేస్ వరల్డ్” అనే అంశంపై బుధవారం ఒక్క రోజు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రిసోర్స్ పర్సన్‌గా హాజరైన డాక్టర్ మంజుల సుమారు రెండు గంటల పాటు కృత్రిమ మేధస్సు ప్రాథమిక అంశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. టెక్స్ట్ అనాలసిస్, స్పీచ్ రికగ్నిషన్, మెషిన్ లెర్నింగ్ వంటి విభాగాల గురించి విపులంగా వివరించారు. సమాజంలోని వివిధ రంగాలపై ఏఐ చూపిస్తున్న ప్రభావం, భవిష్యత్తులో ఈ రంగంలో ఉండబోయే అవకాశాలను ఆమె సోదాహరణంగా వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఇటువంటి సాంకేతిక సదస్సులు విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించడంలోనూ, వారిని గ్లోబల్ మార్కెట్‌కు సిద్ధం చేయడంలోనూ ఎంతో ఉపయోగపడతాయన్నారు. వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి కె. రజినీలత మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా డాక్టర్ కె. శ్రవణకుమారి వ్యవహరించారు. సదస్సులో అధ్యాపకులు ప్రొఫెసర్ ఏ. శ్రీనాథ్, డాక్టర్ దినకర్, కె.రమేష్, డాక్టర్ వి. రమేష్, డాక్టర్ డి.రాజ్ కుమార్, డాక్టర్ టి.రఘోత్తం రెడ్డి, ఎం.రమణాకర్, ఆర్.తిరుపతి, పి.రాజు, సునీత, శివాని, పావని, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సదస్సు అనంతరం విద్యార్థులు అడిగిన పలు సందేహాలను రిసోర్స్ పర్సన్ నివృత్తి చేశారు.