WarangalVoice
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 3:55 am Digital Edition : Ravi Goli

పద్మశాలీ సమాజానికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలి

గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ గడ్డం భాస్కర్‌కు అవకాశం ఇవ్వాలి..

సీఎం రేవంత్‌రెడ్డికి బీసీ సంఘాలు, పద్మశాలీ నాయకులు, మేధావుల విజ్ఞప్తి

వరంగల్ వాయిస్, పరకాల : తెలంగాణ శాసనమండలిలో పద్మశాలీ సమాజానికి సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని వివిధ బీసీ కుల సంఘాల ప్రతినిధులు, పద్మశాలీ సమాజ నాయకులు, మేధావులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు, ప్రముఖ ఆర్థికవేత్త, విద్యావేత్త, పరిశోధకులు ప్రొఫెసర్ గడ్డం భాస్కర్‌కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాపాలన సాగిస్తున్న ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో పద్మశాలీ సమాజానికి చెందిన అనుభవజ్ఞుడైన విద్యావేత్తకు అవకాశం కల్పించడం సముచితమని పేర్కొన్నారు.

గాంధీ జయంతి సందర్భంగా సిరిసిల్లలో ముఖ్యమంత్రి పద్మశాలీ సమాజానికి శాసనమండలిలో ప్రాతినిధ్యం కల్పించే అంశాన్ని ప్రకటించడం హర్షణీయమన్నారు. చేనేతకు మహాత్మా గాంధీకి ఉన్న అనుబంధం, స్వదేశీ ఉద్యమంలో ఖాదీకి ఆయన కల్పించిన ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తూ ఈ ప్రకటన చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ గడ్డం భాస్కర్‌కు అవకాశం కల్పిస్తే చేనేత రంగానికి, పద్మశాలీ సమాజానికి, బీసీ వర్గాలకు గౌరవం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

విద్యా, పరిశోధనా రంగాల్లో విశేష అనుభవం:

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన కాకతీయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా ప్రస్థానం ప్రారంభించిన భాస్కర్‌ బోధన, పరిశోధన, విద్యార్థుల మార్గదర్శకత్వం, సామాజిక సేవా రంగాల్లో విశేష సేవలందించారు. ఆర్థికశాస్త్ర విభాగాధిపతిగా, యూజీసీ-సాప్‌ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్‌కు ప్రత్యేక విధుల అధికారిగా (ఓఎస్డీ) సేవలందించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 51 పరిశోధనా పత్రాలు ప్రచురించగా, 17 మంది పీహెచ్‌డీ, పలువురు ఎంఫిల్‌ పరిశోధకులకు మార్గదర్శకత్వం వహించారు. స్వీడన్‌, నార్వే, అమెరికా, నేపాల్‌, మాల్దీవులు, కెనడా, ఇండోనేషియా తదితర దేశాల్లో విద్యా, పరిశోధనా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

చేనేత రంగంపై ప్రత్యేక అవగాహన:

1986లో తెలంగాణ ఉద్యమ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీతో ఏర్పడిన పరిచయం ఆయనకు చేనేత రంగంపై మరింత అవగాహన కల్పించింది. బాపూజీ మార్గదర్శకత్వంలో చేనేత సహకార సంఘాల సమస్యలు, కార్మికుల ఆర్థిక పరిస్థితులు, వృత్తి అభివృద్ధిపై పరిశోధనాత్మక వ్యాసాలు రచించారు. అవి తెలుగు అకాడమీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. చేనేత రంగంపై ఆయనకున్న అనుభవం నేతన్నల సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని నాయకులు పేర్కొన్నారు.

పద్మశాలీ సమాజ అభివృద్ధికి కృషి:

వరంగల్‌ పోపా అధ్యక్షుడిగా 1996 నుంచి 2002 వరకు పనిచేసిన సమయంలో ప్రతిభావంతులైన విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సులు, మహిళా సదస్సులు, క్రీడా పోటీలు, ఉచిత వైద్య శిబిరాలతో సమాజ అభివృద్ధికి కృషి చేశారు. పదవీ విరమణ అనంతరం కూడా వివిధ జిల్లాల్లోని పద్మశాలీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, యువజన, సామాజిక సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

బీసీ వర్గాల సమస్యలపై గళం వినిపించే అవకాశం:

ప్రొఫెసర్‌ గడ్డం భాస్కర్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం ఒక సామాజిక వర్గానికి పదవి ఇవ్వడమే కాకుండా విద్యావేత్తలు, పరిశోధకులు, సామాజిక సేవకులకు గుర్తింపు ఇచ్చినట్లవుతుందని ప్రతినిధులు పేర్కొన్నారు. చేనేత కార్మికుల సమస్యలు, సహకార సంఘాల బలోపేతం, నేతన్నలకు ఆర్థిక భరోసా, యువతకు ఉపాధి, విద్యారంగ అభివృద్ధి, బీసీల సామాజిక, ఆర్థిక సాధికారత వంటి అంశాలను శాసనమండలిలో సమర్థంగా ప్రస్తావించగల సామర్థ్యం ఆయనకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. పద్మశాలీ సమాజానికి ఇచ్చిన హామీని అమలు చేస్తూ ప్రొఫెసర్‌ గడ్డం భాస్కర్‌కు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు సాదు రఘువీర్, మాజీ వైస్ ప్రిన్సిపల్ నల్లల బిక్షపతి, బిసి నాయకులు గునికంటి రవి, ఎం ఎన్ మూర్తి, శ్రీకాంత్, బైరి రవి, సాయి కుమార్, సునీల్, జనార్దన్, తాళ్ళపల్లి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.