WarangalVoice
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 4:53 pm Digital Edition : Ravi Goli

పిల్లల భవిష్యత్తు కోసమే భూమి ఉంచుకుంటా

వరంగల్ వాయిస్, శాయంపేట : తన పేరిట ఉన్న 35 గుంటల భూమిపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయని, తన పిల్లల భవిష్యత్తు కోసమే ఆ భూమిని ఉంచాలని భావిస్తున్నట్లు మైలారం గ్రామానికి చెందిన నాలిక కళ్యాణి తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ భూ వివాదంపై వివరాలను వెల్లడించారు. మైలారం గ్రామానికి చెందిన నాలిక కుమారస్వామితో తనకు వివాహం జరిగిందని, అనంతరం తాము హనుమకొండలో నివాసం ఉన్నామని కళ్యాణి తెలిపారు. భర్త తరచూ మద్యం సేవించి తనపై దాడి చేయడంతో పుట్టింటికి వెళ్లిపోయానని, పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి తిరిగి అత్తగారింటికి పంపారని చెప్పారు. అయినప్పటికీ కుటుంబ కలహాలు కొనసాగడంతో, పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించిన పంచాయతీలో ఇరువర్గాల పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు వివరించారు. వివాహ సమయంలో తన తండ్రి ఇచ్చిన రూ.75 వేల కట్నానికి బదులుగా అత్తగారి కుటుంబ సభ్యులు తన పేరిట 35 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేశారని పేర్కొన్నారు. విడాకులు జరిగిన ఐదేళ్ల తర్వాత ఈ భూమి విషయంలో వివాదం మొదలైందని, దీనిపై పోలీస్ స్టేషన్‌లో పలుమార్లు ఫిర్యాదు కూడా చేశానని తెలిపారు. అత్తగారికి ఉన్న అప్పుల పరిష్కారానికి సహకరించాలనే ఉద్దేశంతో 10 గుంటల భూమిని ఇచ్చేందుకు కూడా తాను అంగీకరించినట్లు స్పష్టం చేశారు. కాగా, తమ కుటుంబ పంచాయతీ వ్యవహారంలో ఏఎస్ఐ రాజమౌళికి ఎలాంటి ప్రమేయం లేదని ఈ సందర్భంగా కళ్యాణి స్పష్టతనిచ్చారు.