WarangalVoice
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 4:00 pm Digital Edition : Ravi Goli

పేదలకు మంచి చేస్తే విమర్శలా..

ఖబర్దార్ నాయిని రాజేందర్ రెడ్డి

డాక్టర్ కంజర్ల మనోజ్ కుమార్

వరంగల్ వాయిస్, హనుమకొండ: “పేద విద్యార్థులను చదివిస్తే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి అంత కడుపుమంట ఎందుకు? అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. బీఆర్ఎస్ నాయకులపై అసత్య ఆరోపణలు చేయడం మానుకొని, దమ్ముంటే ఒక వంద మంది పేద పిల్లలను చదివించి నీ చిత్తశుద్ధి నిరూపించుకో” అని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ 4వ డివిజన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కంజర్ల మనోజ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి హనుమకొండ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ, నాయకులపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సొంత నిధులతో పేద విద్యార్థుల చదువుల కోసం అండగా నిలుస్తున్న మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దుగ్గంపూడి రంజిత్ రెడ్డిలపై విమర్శలు చేయడం నాయిని రాజేందర్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని మనోజ్ కుమార్ మండిపడ్డారు. ఇటీవలే రంజిత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా 11,000 మందికి స్కూల్ బ్యాగులు, సుమారు 600 మంది పేద విద్యార్థులకు స్కూల్ ఫీజుల చెక్కులను పంపిణీ చేస్తే.. దానిపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కనీసం ఒక్క పెన్సిల్ అయినా అందించని ఎమ్మెల్యే నాయినికి, మా నాయకులను విమర్శించే అర్హత లేదన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ వస్తుంటే భయపడి రాత్రికి రాత్రే పోలీసులను అడ్డుపెట్టుకొని ఫ్లెక్సీలు చించివేయడం నాయిని నైజమని విమర్శించారు. ఇప్పటివరకు 30 మందికి పైగా బీఆర్ఎస్ యువ కార్యకర్తలను పోలీసులతో అక్రమంగా అరెస్టు చేయించి, బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. భద్రకాళి దేవాలయ మాడవీధుల అభివృద్ధి పనుల నిధులు, అనుమతులు అన్నీ గతంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కృషితోనే మంజూరయ్యాయని, అప్పుడు నాయిని ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్థాయికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల గురించి మాట్లాడే అర్హత లేదని.. ఇకనైనా అవాకులు చెవాకులు పేలడం ఆపి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే నాయినికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ 29వ డివిజన్ మాజీ అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్, ముఖ్య నాయకులు పానుగంటి శ్రీధర్, వడిచర్ల ప్రసాద్, గండ్రకోట రాకేష్ యాదవ్, శ్రీకాంత్ చారి, శ్యామ్ కుమార్, వీపీ రెడ్డి, శేఖర్, ఎల్లేష్, సందీప్ యాదవ్, స్నేహిత్ తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు.