WarangalVoice
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 3:46 pm Digital Edition : Ravi Goli

ప్రజావాణి విచారణ వేళ నోట్ల కలకలం..

గ్రామంలో హాట్ టాపిక్‌గా మారిన అధికారి వ్యవహారం
అధికారికి నగదు చేతులు మారినట్లు స్థానికుల గుర్తింపు
వ్యక్తిగత లావాదేవీలే అంటున్న స్థానిక నాయకుడు
నాకేమీ తెలియదంటున్న సదరు అధికారి.. భిన్న వాదనలు
పూర్తిస్థాయి దర్యాప్తునకు గ్రామస్థుల డిమాండ్

పూర్తి వివరాలు రేపటి సంచికలో..

వరంగల్ వాయిస్, పర్వతగిరి : ప్రజావాణి వేదికగా అందిన ఓ ఫిర్యాదుపై విచారణకు వచ్చిన అధికారి ముందే నగదు చేతులు మారడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విచారణ ముగిసిన వెంటనే ఓ స్థానిక నాయకుడు సదరు అధికారికి డబ్బులు అందజేస్తుండగా అక్కడే ఉన్న ఫిర్యాదుదారుడితో పాటు కొందరు గ్రామస్థులు చూసినట్లు సమాచారం. ఈ ఘటన ఇప్పుడు మండలంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయమై సదరు స్థానిక నాయకుడిని చరవాణి ద్వారా వివరణ కోరగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను అధికారికి నగదు ఇచ్చిన మాట నిజమేనని ఆయన అంగీకరించారు. అయితే, ఆ డబ్బులు ప్రస్తుత ప్రజావాణి విచారణకు సంబంధించినవి కావని, గతంలో వారిద్దరి మధ్య ఉన్న ఒక వ్యక్తిగత పనికి సంబంధించిన లావాదేవీల్లో భాగమేనని ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై సదరు విచారణ అధికారిని వివరణ కోరగా, ఆయన ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. తాను ఎవరి వద్ద నుంచీ ఎలాంటి నగదు తీసుకోలేదని, నిబంధనల ప్రకారమే విచారణ జరిపానని స్పష్టం చేశారు. ఒకరు ఇచ్చానని చెప్పడం, మరొకరు తీసుకోలేదని అనడంతో ఈ ఉదంతంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పబ్లిక్‌గా విచారణకు వచ్చిన చోట ఇలా నగదు చేతులు మారడంపై గ్రామస్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఏదో అంతర్గత వ్యూహం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానిజాలు నిగ్గుతేలాలంటే ఉన్నతాధికారులు స్పందించి, పూర్తిస్థాయి విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. అవసరమైతే విచారణ జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.