‘అరైవ్ అలైవ్’ను విజయవంతం చేయాలి
18 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు
బ్లాక్ స్పాట్స్‌పై ప్రత్యేక నిఘా..
అధికారుల సమన్వయంతోనే ప్రమాదాల నివారణ
కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, డాక్టర్ సత్య శారదతో కలిసి సీపీ సమీక్ష
వరంగల్ వాయిస్, హనుమకొండ : రోడ్డు ప్రమాదాల నివారణ ద్వారా సురక్షిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని అధికారులు సమష్టిగా విజయవంతం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుంచి 18 వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంపై శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్ పాయ్, డాక్టర్ సత్య శారద, జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (వీడియో కాన్ఫరెన్స్) లతో కలిసి సీపీ వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హసన్‌పర్తి వంటి ప్రాంతాల్లో జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి శాఖలు సమన్వయంతో స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ప్రమాదంపై లోతైన విచారణ జరిపి, పునరావృతం కాకుండా చూడాలన్నారు. నిబంధనలు పాటించే వాహనదారులకు ముగింపు రోజున ప్రశంసా పత్రాలు అందజేస్తామని వెల్లడించారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చూడాలని, అధికారులే దీనికి ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఆర్టీఏ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాల బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల అర్హతలు, ఫస్ట్ ఎయిడ్ కిట్ల లభ్యతపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలన్నారు.
సురక్షిత సమాజమే లక్ష్యం:
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. ఇప్పటికే జిల్లాలో అధిక శాతం స్కూల్ బస్సుల తనిఖీలు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేయాలని సూచించారు. జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. నేషనల్ హైవేలపై ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక నిఘా అవసరమన్నారు. పోలీస్ మరియు సాంస్కృతిక కళాబృందాల ద్వారా ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై విస్తృత అవగాహన కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీలు రాజమహేంద్ర నాయక్, దార కవిత, అదనపు కలెక్టర్లు రవి, సంధ్యారాణి, వై.వి.గణేష్, ఆర్ అండ్ బి, రవాణా, విద్యుత్, ఆర్టీసీ శాఖల అధికారులు పాల్గొన్నారు.