WarangalVoice
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 3:23 pm Digital Edition : Ravi Goli

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

సర్పంచ్ దాడి వసంత

వరంగల్ వాయిస్, దామెర : ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యంత నాణ్యమైన విద్య అందుతుందని, సమాజంలో ఎంతో ఉన్నత విద్యావంతులైన ఉపాధ్యాయులు ఇక్కడే బోధిస్తున్నారని తక్కల్లపాడు గ్రామ సర్పంచ్ దాడి వసంత రమేష్ అన్నారు. గురువారం దామెర మండలంలోని తక్కల్లపాడు గ్రామంలో బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, అధికారులతో కలిసి ఆమె ఇంటింటికీ తిరిగారు. గ్రామంలోని పిల్లల తల్లిదండ్రులను ప్రత్యక్షంగా కలుస్తూ ప్రభుత్వ పాఠశాలల విశిష్టతను, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సౌకర్యాలను వివరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలోనే ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నామని, ఇక్కడ చదివిన ఎంతోమంది విద్యార్థులు నేడు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని గుర్తుచేశారు. సర్పంచ్, విద్యాశాఖ అధికారులు చేసిన అవగాహన ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లోని వసతులపై నమ్మకంతో ఒకేరోజు 20 మంది విద్యార్థులను ప్రభుత్వ స్కూల్లో చేర్పించడానికి వారి తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో సర్పంచ్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ పాఠశాల నుండి ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్‌పై వెళ్లిన ఉపాధ్యాయులను తక్షణమే తిరిగి రప్పించి, ఇక్కడి విద్యార్థులకు నిరంతరాయంగా బోధన సాగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులను కోరారు. ఈ క్షేత్రస్థాయి కార్యక్రమంలో మండల విద్యాధికారి జమ్మూ నాయక్, స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింగరావు, ఉపాధ్యాయ బృందం, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ దాడి రమేష్, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.