WarangalVoice
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 4:20 am Digital Edition : Ravi Goli

ప్రముఖ డాక్టర్‌కు రూ.15 కోట్ల సుపారీ బెదిరింపు

ముగ్గురి నిందితుల అరెస్ట్

నిందితుల నుంచి ఫోన్లు, బైక్ స్వాధీనం

వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండలోని ఓ ప్రముఖ డాక్టర్‌ను హతమార్చేందుకు రూ.15 కోట్ల సుపారీ వచ్చిందంటూ బెదిరింపులకు పాల్పడి, భారీగా డబ్బులు వసూలు చేయాలని చూసిన ముగ్గురు నిందితులను హనుమకొండ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ దిల్ షుక్ నగర్‌కు చెందిన యమగోని సుభాష్ గౌడ్ (38) గతంలో హన్మకొండలోని రెనోవా హాస్పిటల్‌లో ఒక ప్రముఖ డాక్టర్ వద్ద డ్రైవర్‌గా పనిచేశాడు. అయితే, అతని ప్రవర్తన నచ్చకపోవడంతో డాక్టర్ అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీనిని మనసులో పెట్టుకున్న సుభాష్.. ఎలాగైనా సదరు డాక్టర్‌ను బెదిరించి కోట్లలో డబ్బు వసూలు చేయాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలానికి చెందిన తన స్నేహితుడు శ్రీ మూర్తి శ్రీనివాస్‌ (42)ను సంప్రదించగా, అతడు కూడా డబ్బు ఆశతో ఈ కుట్రకు అంగీకరించాడు. అనంతరం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అజ్మీర నాయక్ తండాకు చెందిన బానోత్ రమేష్‌ (40) అనే మరో వ్యక్తిని కూడా తమ ముఠాలో కలుపుకున్నారు. మాజీ డ్రైవర్ కావడంతో సుభాష్‌కు డాక్టర్ నివాసం, కుటుంబ సభ్యుల వివరాలు, వారి వాహనాలు, ప్రయాణాల గురించిన పూర్తి సమాచారం తెలుసు. కాగా, ప్రస్తుతం హైదరాబాద్‌లోని రెనోవా హాస్పిటల్‌లో వేరొక డాక్టర్ వద్ద పనిచేస్తున్న శ్రీ మూర్తి శ్రీనివాస్.. సదరు బాధితుడైన డాక్టర్ కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించేవాడు. ఈ సమాచారంతో బానోత్ రమేష్ డాక్టర్‌కు ఫోన్ చేసి.. “మిమ్మల్ని చంపడానికి మాకు రూ.15 కోట్ల సుపారీ వచ్చింది. మాకు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే హత్య చేస్తాం” అంటూ తీవ్రంగా బెదిరించాడు. బెదిరింపు కాల్స్‌తో భయాందోళనకు గురైన డాక్టర్ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా, నిఘా నేత్రాల సహాయంతో నిందితుల కదలికలను నిరంతరం గమనించారు. బుధవారం నిందితులు ముగ్గురూ కలిసి హాస్పిటల్ వద్ద మరోసారి రెక్కీ నిర్వహించేందుకు వస్తుండగా.. ములుగు క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా, అప్రమత్తమైన పోలీసులు వారిని వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన ఒక వివో, ఒక హువావే, ఒక వివో వై12, ఒక రియల్‌మీ మొబైల్ ఫోన్లతో పాటు.. ఒక హీరో షైన్ మోటార్ సైకిల్ (నంబర్: టీజీ07-డి-7684) ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత్యంత క్లిష్టమైన ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్ఐ కె.కిషోర్, ఏవో సల్మాన్, హెచ్‌సి రాహూఫ్, సోము నాయక్, కానిస్టేబుళ్లు రమణ, మహిపాల్, హెచ్‌జి రవి, కుమారస్వామిలను హనుమకొండ సీఐ మచ్చ శివ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలు ఎవరైనా ఇలాంటి బెదిరింపు కాల్స్, అక్రమ డబ్బు డిమాండ్లు లేదా అనుమానాస్పద సంఘటనలను ఎదుర్కొంటే ఏమాత్రం భయపడకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను గానీ, లేదా అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను గానీ సంప్రదించాలని పోలీసులు కోరారు.