వరంగల్ వాయిస్, నడికూడ : భూమిని కాపాడుకోవడం అంటే ప్లాస్టిక్ రక్కసిని తరిమికొట్టడమే అని ముస్త్యాలపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు చాటిచెప్పారు. ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవం’ సందర్భంగా బుధవారం పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో ఒకటవ తరగతి విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “ప్లాస్టిక్ నుండి భూమిని కాపాడుకుందాం” అనే ఇతివృత్తంతో చిన్నారి విద్యార్థులు చేసిన ప్రదర్శన చూపరులను మంత్రముగ్ధులను చేసింది. ప్లాస్టిక్ వాడకం వల్ల భూమికి, మూగజీవాలకు, పర్యావరణానికి కలిగే హానిని చిన్నారులు అత్యంత సరళంగా, అందరికీ అర్థమయ్యేలా కళ్లకు కట్టినట్లు వివరించారు. ఇంత చిన్న వయసులోనే పర్యావరణంపై వారు చూపిన అవగాహనను గ్రామస్థులు అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ మేకమల్ల వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాల నుండి తప్పించుకోవాలంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ఒక్కటే మార్గమని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కందుకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భావి భారత పౌరులైన విద్యార్థుల్లో చిన్నతనం నుంచే పర్యావరణ స్పృహ కల్పించడం వల్ల సమాజంలో శాశ్వత మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు శ్రీమతి పావని, శ్రీ సత్యపాల్ సమన్వయకర్తలుగా వ్యవహరించి విద్యార్థులను ప్రోత్సహించారు. అనంతరం సర్పంచ్, హెచ్ఎం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, పచ్చదనాన్ని పెంచాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.