WarangalVoice
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 2:21 pm Digital Edition : Ravi Goli

బహుజన రాజ్య స్థాపన తీన్మార్ మల్లన్నతోనే సాధ్యం

మాదం రజిని కుమార్ యాదవ్

26న ‘మహా ధర్నా’కు తరలిరావాలి

జూన్ 2 నుంచి తీన్మార్ మల్లన్న పాదయాత్ర

వరంగల్ వాయిస్, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్య స్థాపన కేవలం తీన్మార్ మల్లన్న నాయకత్వంలోనే సాధ్యమవుతుందని టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజిని కుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బత్తిని వెంకటేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జిల్లా ముఖ్య నాయకుల స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రజిని కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల ఫీజు దోపిడీకి వ్యతిరేకంగా ఈనెల 26న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమానికి జిల్లా నుండి విద్యార్థుల తల్లిదండ్రులు, బాధితులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. టీఆర్పీ జెండా ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని, పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. త్వరలోనే రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుందని, పార్టీ నాయకత్వం మొత్తం ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. మే రెండో వారం నాటికి హన్మకొండ జిల్లాలోని అన్ని మండల కమిటీల నియామకం పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, జూన్ 2 నుండి పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న చేపట్టబోయే రాష్ట్రవ్యాప్త పాదయాత్రను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు నడుం బిగించాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు బత్తిని వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో సగానికి పైగా డివిజన్లలో కమిటీల నిర్మాణం పూర్తయిందని గ్రేటర్ అధ్యక్షులు మల్లికార్జున శర్మ తెలిపారు. బీసీ ప్రభుత్వ ఉద్యోగుల లెక్కింపు ప్రక్రియ తుది దశకు చేరుకుందని వర్కింగ్ ప్రెసిడెంట్ పూజారి సత్యనారాయణ వివరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు పెండాల సంపత్, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి పోలు రాజు, మహిళా అధ్యక్షురాలు బాలినే లక్ష్మి, ప్రధాన కార్యదర్శి పుట్ట రాజు, సోషల్ మీడియా కన్వీనర్ మార్త శ్రీనివాస్, భద్రకాళి రమణ, మెరుగు భరద్వాజ్, బాల్నే మోహన్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.