WarangalVoice
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 10:53 am Digital Edition : Ravi Goli

బాల్యవివాహాలతోనే తరాల మధ్య పేదరికం

కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి

వరంగల్ వాయిస్, రామన్నపేట : చిన్న వయసులో వివాహాలు జరగడం వల్లే సమాజంలో తరాల మధ్య పేదరికం కొనసాగుతోందని, మహిళలు అట్టడుగు స్థాయిలోనే ఉండిపోవడానికి ఇవే ప్రధాన కారణమని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్ పర్సన్ గుండు సుధారాణి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రామన్నపేటలోని క్యాంపు కార్యాలయంలో సీనియర్ వైద్యులు డాక్టర్ ఆడెపు రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన సామాజిక చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుధారాణి.. బాల్యవివాహాల నివారణకై రూపొందించిన ప్రత్యేక పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకున్న మహిళల్లోనే గృహహింస కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ప్రయోగాల దశలో పెండ్లితో చేటు జరుగుతుందని, దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ.. అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండకుండా వివాహం చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. చట్టాలు ఎంతో కఠినంగా ఉన్నాయని, ఎంతటి వారనైనా శిక్షించే అధికారం వాటికి ఉందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబాల్లో, కుల సంఘాల్లో దీనిపై విస్తృత అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. చిన్న వయసులోనే గర్భధారణ, కుటుంబ బాధ్యతలను మోయాల్సి రావడం స్త్రీల వ్యక్తిగత జీవితంతో పాటు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శిశు మరణాలు, బాల్య మరణాలు, పురిట్లోనే తల్లులు లేదా పిల్లలు కన్నుమూయడానికి బాల్యవివాహాలే ప్రధాన కారణమని ఆయన వివరించారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలలోనే ఈ దురాచారం ఎక్కువగా జరుగుతున్నట్లు తమ పరిశీలనలో తేలిందని తెలిపారు.