WarangalVoice
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 2:39 pm Digital Edition : Ravi Goli

బైక్ అదుపుతప్పి యువకుడి మృతి

వరంగల్ వాయిస్, దామెర : మండల పరిధిలోని పసరగొండ క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ముందు వెళ్తున్న ఆటో డ్రైవర్ ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా బ్రేక్ వేయడమే ఈ ప్రమాదానికి కారణమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామెర మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన పెండ్లి అనుదీప్ (18) మంగళవారం తన మిత్రుడు హరీష్‌తో కలిసి బైక్‌పై హనుమకొండకు బయలుదేరాడు. ఈ క్రమంలో బైక్ పసరగొండ క్రాస్ రోడ్డు సమీపంలోకి రాగానే, వారి ముందు వెళ్తున్న ఆటో డ్రైవర్ మల్లారెడ్డి అనిల్ రెడ్డి ఎటువంటి రోడ్డు ప్రమాద నివారణ సూచనలు పాటించకుండా అకస్మాత్తుగా ఆటోను రోడ్డుపై ఆపేశాడు. ఆటో అకస్మాత్తుగా ఆగడంతో వెనుక వస్తున్న అనుదీప్ తన బైక్‌ను నియంత్రించలేకపోయాడు. దీంతో బైక్ అదుపుతప్పి వారిద్దరూ రోడ్డుపై బలంగా పడిపోయారు. ఈ ప్రమాదంలో అనుదీప్ తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అనుదీప్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మిత్రుడు హరీష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంపై మృతుడి తల్లి జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ అనిల్ రెడ్డిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు దామెర ఎస్సై ఇ. వీరభద్రరావు తెలిపారు. ప్రమాదానికి కారణమైన ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 18 ఏళ్ల వయసులోనే కొడుకు కళ్లముందే అనంత లోకాలకు వెళ్లడంతో సీతారాంపురం గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.