WarangalVoice
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 4:41 pm Digital Edition : Ravi Goli

భూముల రీ-సర్వేకు ప్రజలంతా సహకరించాలి

దామెర తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి

వరంగల్ వాయిస్, దామెర : భూ సమస్యలు పూర్తిగా తలెత్తకుండా గ్రామాల్లో భూములను అత్యంత పారదర్శకంగా రీ-సర్వే చేస్తున్నామని, గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో అధికారులకు సహకరించాలని దామెర ఎమ్మార్వో జ్యోతి వరలక్ష్మి దేవి పిలుపునిచ్చారు. బుధవారం దామెర మండలంలోని ఓగులాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ కేతిపెళ్లి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామంలోని 340 సర్వే నంబర్ల పరిధిలోని 1,197 ఎకరాల భూమిని అంగుళం భూమి కూడా వదలకుండా డిజిటల్ పద్ధతిలో సర్వే చేసి రికార్డుల్లో నిక్షిప్తం చేయనున్నట్లు ఎమ్మార్వో తెలిపారు. ప్రభుత్వ, చెరువు భూముల గుర్తింపు: ఈ రీ-సర్వే ద్వారా ప్రభుత్వ భూములతో పాటు చెరువు శిఖం భూములను సైతం స్పష్టంగా గుర్తిస్తామని చెప్పారు. భూముల విషయంలో ఎలాంటి అపోలకు తావులేకుండా పూర్తి పారదర్శకతతో ఈ ప్రక్రియ కొనసాగుతుందని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా రైతులు లేవనెత్తిన వివిధ భూ సమస్యలకు ఆమె ఓపికగా సమాధానమిచ్చారు. ఈ గ్రామసభలో భూముల కొలతల శాఖ అధికారులు, సర్వేయర్లు పాల్గొని రీ-సర్వే ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలపై రైతులకు, స్థానికులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్వే నిర్వహించే సమయంలో సంబంధిత రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు సర్వేయర్లకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ కవిత, జీపీఓ హరిప్రసాద్‌తో పాటు పెద్ద సంఖ్యలో రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.