WarangalVoice
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 3:01 pm Digital Edition : Ravi Goli

మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలి

‘శిఖర’ గ్రాడ్యుయేషన్ డేలో వక్తలు

మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం

వరంగల్ వాయిస్, హనుమకొండ : యువత, మహిళల్లో వృత్తి నైపుణ్యాలను పెంపొందించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “శిఖర స్కిల్ సెంటర్” మొదటి బ్యాచ్ విజయవంతంగా పూర్తయింది. హన్మకొండ హరిత హోటల్‌లో శనివారం నిర్వహించిన “గ్రాడ్యుయేషన్ డే” వేడుకలో టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం విభాగాల్లో శిక్షణ పొందిన 260 మంది మహిళలకు అతిథులు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో డిగ్రీల కంటే చేతివృత్తిలో నైపుణ్యం ఉండటం అత్యంత కీలకమని అన్నారు. సమాజంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు సులభంగా దొరుకుతున్నారని, కానీ నైపుణ్యం గల ఎలక్ట్రీషియన్లు, మెకానిక్ల కొరత వేధిస్తోందని పేర్కొన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్న రాకేష్ రెడ్డి ప్రయత్నాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. “ఒక ఇంట్లో మహిళ ఆర్థికంగా నిలబడితే ఆ కుటుంబం మొత్తం వృద్ధిలోకి వస్తుంది. వరంగల్ నగరంలోని మహిళల ఉపాధి కోరిక మేరకు ‘శిఖర స్కిల్ సెంటర్’ ప్రారంభించాం. కేవలం జాబ్ మేళాలే కాకుండా, వారిలో నైపుణ్యాన్ని నింపడం ద్వారా స్వయం ఉపాధి పొందేలా చేస్తున్నాం” అని తెలిపారు. శిఖర ద్వారా ఉచిత శిక్షణ పొందిన వారు సమాజంలో గౌరవంగా బతుకుతుండటం సంతోషకరమన్నారు. నీలిమ హాస్పిటల్స్ చైర్మన్ పల్లా నీలిమ మాట్లాడుతూ.. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా రాణి రుద్రమల్లా ఎదగాలని ఆకాంక్షించారు. శిక్షణ పొందిన 260 మంది మహిళలకు మరియు వారి కుటుంబాలకు తమ హాస్పిటల్‌లో ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వరల్డ్ సైకిల్ ట్రావెలర్ రంజిత్ మాట్లాడుతూ.. ఆత్మవిశ్వాసం, నిర్దిష్ట లక్ష్యం ఉంటే ప్రపంచాన్నే జయించవచ్చని, మహిళలు వివక్షను వీడి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శిఖర స్కిల్ సెంటర్ కోఆర్డినేటర్లు గువ్వ రాజేష్, కార్తీక్ రెడ్డి, ఇండస్ ఫౌండేషన్ కార్యదర్శి ఏషబోయిన పురుషోత్తం, కార్పొరేటర్ రవి నాయక్, సర్పంచ్‌లు కృష్ణ మూర్తి, గడ్డం రఘు వంశీ, బీఆర్ఎస్వీ నాయకులు జెట్టి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.