WarangalVoice
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 1:41 pm Digital Edition : Ravi Goli

మహిళా కానిస్టేబుల్ సంగీత ఆత్మహత్య!

తోటి కానిస్టేబుల్ వేధింపులే కారణమని సూసైడ్ నోట్

అత్తగారింట్లో ఉరివేసుకుని బలవన్మరణం

నిందితుడు శ్రీధర్‌పై కేసు నమోదు

మట్టెవాడ పోలీసుల దర్యాప్తు

వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ నగరంలోని మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉంటూ ఇతరులకు ధైర్యాన్ని చెప్పాల్సిన ఓ మహిళా కానిస్టేబుల్, తోటి ఉద్యోగి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. మట్టెవాడలోని తన అత్తగారింట్లో సంగీత (33) ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు సంగీత ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం యథావిధిగా విధులకు వెళ్లిన ఆమె, కొద్దిసేపటికే తిరిగి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో భర్త ఇంట్లో లేకపోవడంతో, గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు. ఎంతసేపటికీ గది గడప దాటకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా, సంగీత అచేతనంగా వేలాడుతూ కనిపించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు సంగీత రాసిన ఆత్మహత్య లేఖ (సూసైడ్ నోట్) లభ్యమైంది. అందులో తన మరణానికి తోటి కానిస్టేబుల్ శ్రీధర్ కారణమని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. శ్రీధర్ పెడుతున్న వేధింపులు భరించలేకనే తాను ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నానని లేఖలో సంచలన విషయాలను వెల్లడించారు. బాధితురాలి ఆవేదన నిండిన ఆ లేఖ ఇప్పుడు పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే మట్టెవాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడు కానిస్టేబుల్ శ్రీధర్‌పై కేసు నమోదు చేసినట్లు మట్టెవాడ సీఐ కరుణాకర్ తెలిపారు. బాధ్యుడైన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంగీత బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.