WarangalVoice
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 5:00 pm Digital Edition : Ravi Goli

మహిళా పోలీసుల ఐక్యతను బలోపేతం చేయడమే లక్ష్యం : వరంగల్ సీపీ శ్వేత

మహిళా పోలీసుల ఆత్మీయ సమ్మేళనం…

వరంగల్ వాయిస్, క్రైమ్ :వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసు అధికారులు, సిబ్బందికి శనివారం భీమారంలోని శుభం ఫంక్షన్ హాల్‌లో పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హోంగార్డుల నుంచి ఉన్నతాధికారుల వరకు సుమారు 360 మంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా వరంగల్ సీపీ శ్వేత మాట్లాడుతూ.. కుటుంబ బాధ్యతలతో పాటు పోలీస్ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్న మహిళా సిబ్బంది శాఖకు మంచి పేరు తీసుకువస్తున్నారని ప్రశంసించారు. మహిళా పోలీసుల ఐక్యతను బలోపేతం చేయడం, వారి ఆరోగ్యం, సంక్షేమంపై అవగాహన కల్పించడం లక్ష్యంగా సమ్మేళనం నిర్వహించినట్లు తెలిపారు.అనంతరం గైనకాలజిస్ట్ డాక్టర్ రాధిక మాట్లాడుతూ… మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య, కుటుంబ, వృత్తిపరమైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.న్యూట్రిషనిస్ట్ శ్రీలత సమతుల్య పౌష్టికాహారం తీసుకోవడం, వ్యక్తిగత ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం అవసరమని తెలిపారు.తదనంతరం సైకాలజిస్ట్ ప్రొఫెసర్ రాధా మాట్లాడుతూ….కుటుంబ, వృత్తిపరమైన ఒత్తిళ్లను అధిగమించేందుకు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. భావోద్వేగ నియంత్రణ, సానుకూల దృక్పథం, తగిన విశ్రాంతి, కుటుంబ సభ్యులు, సహచరుల సహకారం ద్వారా మానసిక ప్రశాంతత సాధ్యమని వివరించారు.ఈ కార్యక్రమంలో మహిళా ఇన్‌స్పెక్టర్లు సువర్ణ, సుజాత, ఎస్సైలు కిరణ్మయి, శ్రావణి, లలిత, స్వాతి తదితరులు పాల్గొన్నారు.