WarangalVoice
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 2:54 pm Digital Edition : Ravi Goli

మహిళా బిల్లును అడ్డుకోవడం చీకటి రోజు

డాక్టర్‌ వన్నాల వెంకటరమణ

వరంగల్ వాయిస్, హనుమకొండ : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 131వ సవరణ బిల్లును కాంగ్రెస్, ‘ఇండి’ కూటమి అడ్డుకోవడం భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక చీకటి రోజు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ మండిపడ్డారు. శనివారం ఆయన హనుమకొండలో మీడియాతో మాట్లాడుతూ.. మహిళా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుకు నిరసనగా ఆయన ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ మహిళా నేతృత్వంలో అభివృద్ధికి బాటలు వేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా అడ్డుతగులుతోందని ధ్వజమెత్తారు. “కాంగ్రెస్ దృష్టిలో మహిళలంటే కేవలం ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీలు మాత్రమేనా? సామాన్య మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కకూడదా?” అని ఆయన ప్రశ్నించారు. డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా సీట్లు పెంచి అందరికీ సమన్యాయం చేస్తామని ప్రధాని మోదీ, అమిత్ షా గారు స్పష్టత ఇచ్చినా, బీజేపీకి ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న అక్కసుతోనే విపక్షాలు ఈ బిల్లును అడ్డుకున్నాయని ఆరోపించారు. మహిళల హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ నేతలు వెంటనే దేశంలోని మహిళా సోదరీమణులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా శక్తిని తక్కువగా అంచనా వేస్తున్న ‘ఇండి’ కూటమికి రాబోయే రోజుల్లో మహిళలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ బిల్లు ఆగిపోవడం వల్ల మహిళా హక్కులకు ఘోర అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు కుండె గణేష్, శ్రీవర్ధన్ రెడ్డి, వివిధ మహిళా మోర్చా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.