విజేతగా నిలిచిన నాగర్‌కర్నూల్ జట్టు
వరంగల్ వాయిస్, పర్వతగిరి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం పల్లవి మోడల్ స్కూల్ వేదికగా మూడు రోజుల పాటు ఉత్సాహభరితంగా సాగిన 45వ రాష్ట్రస్థాయి బాలికల షూటింగ్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలు నవంబర్ 16తో విజయవంతంగా ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఉత్సాహంగా క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో నాగర్‌కర్నూల్ జట్టు అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు అభినందనలు వెల్లువెత్తాయి. నవంబర్ 14 నుంచి 16 వరకు జరిగిన ఈ రాష్ట్రస్థాయి పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి జట్లకు ఆహ్వానం అందగా, మొత్తం 28 జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా బరిలోకి దిగి తమ ప్రతిభను చాటుకున్నారు. హోరాహోరీగా సాగిన ఈ టోర్నీలో క్రీడాకారులు తమ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ప్రథమ స్థానంలో నాగర్‌కర్నూల్ జిల్లా జట్టు, ద్వితీయ స్థానంలో మహబూబ్‌నగర్ జిల్లా జట్టు, తృతీయ స్థానంలో మహబూబాబాద్ జిల్లా జట్టులు నిలిచాయి. పోటీల ముగింపు కార్యక్రమంలో పర్వతగిరి మండల విద్యాధికారి భిక్షపతి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేత జట్ల క్రీడాకారులకు ట్రోఫీలు, మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. క్రీడలు విద్యార్థులలో మానసిక ఉల్లాసంతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని ఆయన కొనియాడారు. ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి అత్యుత్తమ ప్రతిభతో ఎంపికైన క్రీడాకారులు త్వరలో ఉత్తరప్రదేశ్‌లో జరుగనున్న జాతీయస్థాయి షూటింగ్‌బాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు రాష్ట్ర షూటింగ్‌బాల్ ప్రధాన కార్యదర్శి ఐలయ్య వెల్లడించారు. జాతీయ స్థాయిలోనూ మన రాష్ట్ర క్రీడాకారులు సత్తా చాటి పతకాలు సాధించాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అన్నారం గ్రామ సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగయ్య, కార్యదర్శి అనిల్‌కుమార్, పాఠశాల చైర్మన్ రాచకొండ అశోక్ చారి, కరస్పాండెంట్ గంజి మహేందర్, డైరెక్టర్ కోటగిరి రమేష్, ప్రిన్సిపాల్ మేకల అశ్విని తదితరులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.