బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన దామెర ఎస్సై
వరంగల్ వాయిస్, దామెర : దామెర పోలీసులు మెరుపు వేగంతో స్పందించి ఒక మిస్సింగ్ కేసును కేవలం మూడు గంటల్లోనే ఛేదించారు. అదృశ్యమైన 13 ఏళ్ల బాలికను సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించి తమ మానవత్వాన్ని, వృత్తి నిబద్ధతను చాటుకున్నారు. శనివారం దామెర మండలానికి చెందిన చాపర్తి సతీష్ కుమార్తె సాత్విక (13) అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న దామెర ఎస్సై కొంక అశోక్, వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సై సమయస్ఫూర్తితో వ్యవహరించి, సాంకేతిక పరిజ్ఞానం, స్థానిక సమాచారంతో గాలింపు ముమ్మరం చేయగా, మూడు గంటల వ్యవధిలోనే బాలిక ఆచూకీ లభ్యమైంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాలికను సురక్షితంగా స్వాధీనం చేసుకున్న పోలీసులు, వెంటనే ఆమెను తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.తమ బిడ్డ అదృశ్యమైన కొద్ది సేపటికే తిరిగి అప్పగించడంతో సాత్విక తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. వేగంగా స్పందించి తమకు అండగా నిలిచిన ఎస్సై కొంక అశోక్ కి, పోలీస్ సిబ్బందికి వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పోలీసుల పనితీరును మండల ప్రజలు సైతం అభినందిస్తున్నారు.