WarangalVoice
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 2:17 pm Digital Edition : Ravi Goli

మూడేళ్ల నిరాధరణకు ముగింపు

బాబాసాహెబ్ విగ్రహ సుందరీకరణకు శంకుస్థాపన

(మహాదేవపూర్ – వరంగల్ వాయిస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని అన్నారం కూడలి వద్ద మూడేళ్లుగా నిరాధరణకు గురవుతున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. మంగళవారం బాబాసాహెబ్ 135వ జయంతిని పురస్కరించుకొని బహుజనసేన ఆధ్వర్యంలో విగ్రహ సుందరీకరణ పనులకు ఘనంగా శంకుస్థాపన చేశారు. కాళేశ్వరం ప్రధాన రహదారి అన్నారం కూడలిలో మూడేళ్ల క్రితం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, సరైన పర్యవేక్షణ లేక అగౌరవంగా ఉందనే ఉద్దేశంతో బహుజనసేన ఈ నిర్ణయం తీసుకుంది. విగ్రహం చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టి, భక్తులు నివాళులర్పించేందుకు వీలుగా మెట్లు మరియు ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించనున్నారు. ఈ సందర్భంగా నాయకులు కొబ్బరికాయ కొట్టి పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భూపాలపల్లి మాజీ జడ్పీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని గౌరవప్రదంగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. ఆయన ఆశయాలను స్మరిస్తూ సామాజిక అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్నారం సర్పంచ్ ప్రభాకర్, ఉప సర్పంచ్ సమ్మయ్య, మంథని నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కేదారి గీత, నాయకులు శ్రీపతి బాపు, శంకర్ లాల్, కొండ రవీందర్, బహుజనసేన ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.