దామెర ఎస్సై కొంక అశోక్
దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలే రక్షణ కవచం
వరంగల్ వాయిస్, దామెర : ప్రజల ఆస్తిపాస్తుల రక్షణకు, నేరాల అదుపునకు ‘మూడో కన్ను’గా పిలవబడే సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని దామెర ఎస్సై కొంక అశోక్ అన్నారు. శుక్రవారం దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామస్తులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలో దొంగతనాలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సీసీ కెమెరాల ఆవశ్యకతను వారికి వివరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. కమ్యూనిటీ సీసీ కెమెరాల వల్ల కలిగే భద్రతను, ఇటీవల కాలంలో కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఛేదించిన పలు దొంగతనాల కేసులను ఉదాహరణగా వివరించారు. ప్రతి గ్రామంలోని ప్రధాన కూడళ్లతో పాటు అన్ని వాడలను కవర్ చేసేలా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వీటి ఏర్పాటు కోసం ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎస్సై పిలుపు మేరకు పలువురు ప్రజాప్రతినిధులు, దాతలు స్పందిస్తూ.. తమ గ్రామాల్లో త్వరలోనే పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటామని, తమ గ్రామాలను ‘చోరీల రహిత గ్రామాలు’గా తీర్చిదిద్దుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముందుకు వచ్చిన దాతలను ఎస్సై అభినందించారు. ప్రతి ఇంటి యజమాని కూడా తమ ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. నేర రహిత సమాజం కోసం పోలీస్ శాఖకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని ఈ సందర్భంగా ఎస్సై కొంక అశోక్ విజ్ఞప్తి చేశారు.