వేములవాడలో పోస్టర్ ఆవిష్కరణ
25న మేడ్చల్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభ
జాగృతి శ్రేణుల ఆధ్వర్యంలో ‘ఆవిర్భావ’ సన్నాహాలు
వరంగల్ వాయిస్, వేములవాడ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన పోస్టర్‌ను జాగృతి నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ నూనె మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వర్ధ సతీష్ కుమార్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్ధ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ జాగృతి ద్వారా కవితక్క చేసిన సేవా కార్యక్రమాలే ఈ కొత్త పార్టీకి పునాది అని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని, ముఖ్యంగా బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలో ఆమె పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. మహిళలు, యువతకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి కల్పించడమే కాకుండా, ప్రస్తుతం ‘జనంబాట’ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ నెల 25వ తేదీన మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో లక్ష మందితో కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్లు నాయకులు వెల్లడించారు. ఇటీవల ఎదురైన రాజకీయ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, ప్రజల పక్షాన నిలబడేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్‌చార్జి తోట కనకయ్య, చందుర్తి మండల ఇన్‌చార్జ్ సలెంద్ర నవీన్, కోనరావుపేట మండల ఇన్‌చార్జ్ కులేరు వినయ్, వేములవాడ రూరల్ ఇన్‌చార్జ్ తుమ్మల దిలీప్ పాల్గొన్నారు. అలాగే గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల ఇన్‌చార్జీలు, పలువురు జాగృతి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.