గండ్ర వెంకట రమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ప్రజాధనంతో సభలు నిర్వహిస్తూ కాలయాపన చేస్తున్నారు
వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌లో రేవంత్‌కు డిపాజిట్ దక్కదు
కాళేశ్వరంపై విచారణల పేరుతో రైతులను వంచిస్తున్న సర్కార్
వరంగల్ వాయిస్, హనుమకొండ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని ఒక “యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి”గా అభివర్ణించిన ఆయన, రేవంత్ ప్రజల ఆశీస్సులతో కాకుండా కేవలం పరిస్థితుల ప్రభావం వలనే ఆ పదవికి చేరుకున్నారని విమర్శించారు. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సభలన్నీ ప్రజాధనాన్ని వృథా చేయడమేనని గండ్ర ఆరోపించారు. రేవంత్ రెడ్డిలా అందరూ ఇతరులను “తొక్కుకుంటూ” ఎదగలేరని వ్యాఖ్యానించారు. “మళ్లీ నేనే ముఖ్యమంత్రి అవుతాను” అని రేవంత్ రెడ్డి ప్రకటనలు చేయడం హాస్యాస్పదమని, ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవుతుందని, స్వయంగా రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో డిపాజిట్ కూడా కోల్పోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ సాగు, త్రాగునీటి అవసరాలను తీర్చే గొప్ప ప్రాజెక్ట్ అని ప్రపంచానికే తెలుసని గండ్ర పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతో విచారణల పేరుతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులను గాలికొదిలేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని రమణా రెడ్డి తెలిపారు. హామీల అమలులో వైఫల్యం మరియు ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్య వైఖరిపై ప్రజలు సరైన సమయంలో తగిన తీర్పు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.