‘వెంకటేశ్వర కార్ గిఫ్ట్’ నిర్వాహకులపై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి
రూ. 4.70 లక్షల విలువైన బ్రీజా కార్, రూ. 11.50 లక్షల విలువైన లాటరీ టికెట్లు సీజ్
ముగ్గురు నిందితుల అరెస్ట్.. మిల్స్ కాలనీ పీఎస్‌కు అప్పగింత
వరంగల్ వాయిస్, వరంగల్ : లాటరీల పేరుతో అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తూ, చట్టవిరుద్ధంగా సొమ్ము వసూలు చేస్తున్న ముఠా గుట్టును వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. వరంగల్ ఉర్సు గుట్ట ప్రాంతంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ‘వెంకటేశ్వర కార్ గిఫ్ట్ కాంటెస్ట్’పై పోలీసులు గురువారం మెరుపు దాడులు నిర్వహించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు పూజారి సుమన్, సముద్రాల రాకేష్, కర్జుగుతా సురేష్ కలిసి ఉర్సు గుట్ట ప్రాంతంలో ‘వేంకటేశ్వర కార్ గిఫ్ట్స్’ పేరుతో ఒక లక్కీ డ్రా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేవలం రూ. 200లకే రూ. 4.70 లక్షల విలువైన బ్రీజా కార్ (TS03EQ4101) సొంతం చేసుకోవచ్చంటూ నమ్మబలికి ప్రజల నుండి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. ఇప్పటివరకు ఒక్కొక్కటి రూ. 200 చొప్పున ఏకంగా 5,753 లాటరీ స్లిప్పులను విక్రయించి, రూ.11,50,000 (పదకొండు లక్షల యాభై వేల రూపాయలు) వసూలు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో తేలింది. నగరంలో లాటరీలు, నకిలీ బహుమతుల పేరుతో మోసాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతా రెడ్డి ఐ.పి.ఎస్. ఆదేశించారు. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ ఎ.సి.పి. మధుసూదన్ పర్యవేక్షణలో, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె. శ్రీధర్ నేతృత్వంలోని బృందం పక్కా సమాచారంతో ఈ దాడి నిర్వహించింది. దాడిలో భాగంగా పోలీసులు నిందితుల నుంచి రూ.4.70 లక్షల విలువైన బ్రీజా కారు, 5,753 లాటరీ స్లిప్పులు (విలువ రూ. 11,50,000/-), 34 లాటరీ బుక్కులు, 6 స్మార్ట్ మొబైల్ ఫోన్లు, రూ. 53,500/- ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో పోచమ్మమైదాన్‌కు చెందిన కార్ల వ్యాపారి పూజారి సుమన్ (36), హనంకొండ సుబేదారికి చెందిన కార్ కన్సల్టెంట్ సముద్రాల రాకేష్ (27), శివనగర్‌కు చెందిన కార్ కన్సల్టెంట్ కర్జుగట్ట సురేష్ (32) ఉన్నారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ విజయవంతమైన దాడిలో టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె. శ్రీధర్, ఎస్ ఐ వీరస్వామి, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. అనధికారిక లక్కీ డ్రాలు, లాటరీల బారిన పడి ప్రజలు తమ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని పోలీసులు హెచ్చరించారు.