WarangalVoice
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 3:42 am Digital Edition : Ravi Goli

విజయవంతమైన అరుదైన శస్త్రచికిత్స

అతుక్కున్న కిడ్నీలను వేరు చేసిన వైద్యులు

వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండలోని శ్రీ శ్రీనివాస కిడ్నీ సెంటర్‌లో వైద్యులు అత్యంత అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. 12 సంవత్సరాల బాలుడికి ఎడమ కిడ్నీ కుడి వైపునకు ఉండడంతో పాటు, రెండు కిడ్నీలు అతుక్కుపోయి ఉన్న సమస్యను లాప్రోస్కోపిక్ పద్ధతిలో విజయవంతంగా తొలగించినట్లు ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ ఏ.రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ మండలం కాప్రాకు చెందిన సబ్బాని పూర్ణచంద్ర (12) అనే బాలుడు తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. బాలుడికి ఎడమ కిడ్నీ కుడి కిడ్నీ వైపు ఉండడమే కాకుండా, రెండు కిడ్నీలు అతుక్కొని పనిచేయకపోగా ఇన్ఫెక్షన్‌కు గురయ్యాయి. ఈ అరుదైన వైద్య చికిత్సను వైద్య పరిభాషలో ‘లెఫ్ట్ టు రైట్ క్రాస్డ్ ఫ్యూజ్డ్ ఎక్టోపిక్ కిడ్నీ’అంటారు. లాప్రోస్కోపిక్ పద్ధతిలో అత్యంత నైపుణ్యంతో శస్త్రచికిత్స నిర్వహించారు. రెండు కిడ్నీలు ఒకే వైపు అతుక్కొని ఉండడం వల్ల, బాగా పనిచేసే కిడ్నీ రక్తనాళాలు మరియు మూత్ర నాళాలు అత్యంత సమీపంలో ఉంటాయి. ఇటువంటి క్లిష్టమైన సందర్భంలో ఎడమ కిడ్నీని కుడి కిడ్నీ నుండి వేరు చేయడం వైద్యపరంగా చాలా సవాల్‌తో కూడుకున్నది. సుమారు 2 గంటల 30 నిమిషాల పాటు ఈ సర్జరీ కొనసాగింది. ఆపరేషన్ జరిగిన 72 గంటల్లోనే బాలుడు పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ విజయవంతమైన శస్త్రచికిత్సలో డాక్టర్ రాంప్రసాద్‌ రెడ్డితో పాటు డాక్టర్ రిజ్వాన్, డాక్టర్ సామ్రాట్ తదితర వైద్య బృందం పాల్గొంది. అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేసిన వైద్యులను పలువురు అభినందించారు.